RO-KO: టీమిండియాలో చోటు కావాలా?.. కోహ్లీ, రోహిత్‌లకు బీసీసీఐ కొత్త షరతు!

BCCI Makes Domestic Cricket Mandatory for Virat Kohli Rohit Sharma
  • వన్డే జట్టులో చోటు కోసం కోహ్లీ, రోహిత్‌లకు కొత్త నిబంధన
  • దేశవాళీ క్రికెట్ ఆడితేనే ఎంపికకు పరిశీలిస్తామన్న‌ బీసీసీఐ
  • విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు అంగీకరించిన రోహిత్ శర్మ
  • తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించని విరాట్ కోహ్లీ 
  • దేశవాళీ ఆడాలన్న నిబంధన గతంలోనూ ఉందని గుర్తు చేసిన‌ బోర్డు
టీమిండియా సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తుపై జరుగుతున్న చర్చకు తెరదించుతూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే వారిద్దరూ తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని స్పష్టం చేసింది. టెస్టులు, టీ20ల నుంచి ఇప్పటికే తప్పుకున్న ఈ ఇద్దరు దిగ్గజాలు ప్రస్తుతం కేవలం 50 ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి మ్యాచ్ ఫిట్‌నెస్‌ను నిర్ధారించుకోవడానికే బోర్డు ఈ నిబంధన విధించినట్లు తెలుస్తోంది.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు జట్టు ఎంపిక జరగనున్న నేపథ్యంలో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ ఆడాలని బోర్డు సూచించినట్లు సమాచారం. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రకారం బీసీసీఐ ఆదేశాలకు రోహిత్ శర్మ సానుకూలంగా స్పందించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు తాను అందుబాటులో ఉంటానని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు సమాచారం ఇచ్చాడు. అయితే, విరాట్ కోహ్లీ మాత్రం తన లభ్యతపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

"భారత జట్టుకు ఆడాలనుకుంటే దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాల్సిందేనని బోర్డు, జట్టు యాజమాన్యం వారిద్దరికీ తెలియజేశాయి. రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయినందున, ఫిట్‌గా ఉండేందుకు ఇది తప్పనిసరి" అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. రోహిత్ శర్మ నిబద్ధత ఎంతలా ఉందంటే, నవంబర్ 26న ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో ఆడేందుకు కూడా తాను సిద్ధమేనని ఎంసీఏకు తెలిపాడని సమాచారం.

గతంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమి తర్వాత కూడా బీసీసీఐ ఇలాంటి ఆదేశాలే జారీ చేయగా, కోహ్లీ, రోహిత్ చెరొక రంజీ మ్యాచ్ ఆడారు. ఇప్పుడు 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని మరోసారి అదే విధానాన్ని బోర్డు అమలు చేస్తోంది. ఆటగాళ్లు అందుబాటులో ఉన్నప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడటం చాలా ముఖ్యమని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఇటీవలే పునరుద్ఘాటించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆటలో పదును తగ్గకుండా ఉండేందుకు ఇది ఏకైక మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌తో కోహ్లీ, రోహిత్ తిరిగి జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో రోహిత్ ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌'గా నిలవగా, కోహ్లీ నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో 74 పరుగులు చేశాడు. ఇప్పుడు బీసీసీఐ తాజా ఆదేశాలతో ఈ ఇద్దరు సీనియర్ల భవిష్యత్తు వారి దేశవాళీ ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని స్పష్టమవుతోంది.
RO-KO
Virat Kohli
Rohit Sharma
BCCI
Indian Cricket Team
Vijay Hazare Trophy
Domestic Cricket
Team India
Ajit Agarkar
One Day Internationals
MCA

More Telugu News