Andesree: అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలి... ప్రధానిని కోరతా: సీఎం రేవంత్ రెడ్డి

Andesree to be Awarded Padma Shri Says CM Revanth Reddy
  • అందెశ్రీ కీర్తిని శాశ్వతం చేస్తామన్న రేవంత్
  • ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ
  • ఆయన మరణం ఆప్తుడిని కోల్పోయిన బాధను కలిగించిందని వ్యాఖ్య
ప్రముఖ రచయిత, జన వాగ్గేయకారుడు అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన సీఎం, అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఆయన కీర్తిని శాశ్వతం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, అందెశ్రీకి మరణానంతరం పద్మశ్రీ పురస్కారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. "అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశాను. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఈ విషయంపై వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తాను. ఇందుకు కేంద్ర మంత్రులు కూడా సహకరించాలి" అని ఆయన కోరారు. తెలంగాణ ఉన్నంత వరకు అందెశ్రీ పేరు నిలిచి ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. "రాజకీయ నేతలను నేరుగా కలవనని చెప్పిన అందెశ్రీ గారితో మీడియా ద్వారానే పరిచయం ఏర్పడింది. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా ఒక ఆప్తుడిని కోల్పోయిన బాధను మిగిల్చింది" అని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. "జీవితాంతం తెలంగాణ కోసం తపించిన గొప్ప వ్యక్తి ఆయన. రచయితగా, కళాకారుడిగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు. తన ఆరోగ్యం గురించి కానీ, డబ్బు గురించి కానీ ఏనాడూ ఆలోచించని నిస్వార్థ జీవి" అని కొనియాడారు.

అందెశ్రీ రచించిన 'నిప్పుల వాగు' పుస్తకం 20 వేల ప్రతులను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతామని సీఎం వెల్లడించారు. ఆయన అభిమానుల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించి, ఆయనకు సముచిత న్యాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
Andesree
Andesree Padma Shri
Revanth Reddy
Telangana
Lyricist Andesree
Padma Shri Award
CM Revanth Reddy
20 Vella Nippula Vaagu
Narendra Modi
Telangana government

More Telugu News