Ayyanna Patrudu: వైసీపీకి ప్రతిపక్ష హోదాపై స్పీకర్ ఏమన్నారంటే..!

Speaker Ayyanna Patrudu Refuses Opposition Status to YSRCP
  • రాజ్యాంగ నిపుణులతో చర్చించినట్లు అయ్యన్న పాత్రుడు వెల్లడి
  • ప్రతిపక్ష హోదాకు అవసరమైన ఎమ్మెల్యేలు వైసీపీకి లేరని వ్యాఖ్య
  • నిర్ణీత సంఖ్య కన్నా తక్కువ సీట్లున్న పార్టీకి హోదా ఇవ్వడం కుదరదని వివరణ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెల్చుకున్న వైసీపీ ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ కోరుతుండడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తాజాగా స్పందించారు. జగన్ కోరికపై రాజ్యాంగ నిపుణులు, మిగతా రాష్ట్రాల స్పీకర్లతో తాను చర్చించానని తెలిపారు. అయితే, నిర్ణీత సంఖ్య కన్నా తక్కువ సీట్లకే పరిమితమైన వైసీపీకి రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని వారు చెప్పినట్లు పేర్కొన్నారు.

ప్రతిపక్ష హోదాకు అవసరమైన ఎమ్మెల్యేలు వైసీపీకి లేరని, అందుకే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని కుతుకులూరులో మీడియా ప్రతినిధులతో ఈ వ్యాఖ్యలు చేశారు. కుతుకులూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం, అనపర్తిలో బీటీరోడ్డును స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు.

అసెంబ్లీకి రావాలంటూ జగన్ కు హితవు..
బయట మైకులు పట్టుకుని మాట్లాడడం కాదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు స్పీకర్ అయ్యన్న పాత్రుడు హితవు పలికారు. సభలో ఆయనకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని చెప్పారు. జగన్ పాలనలో తనను అరెస్టు చేయించిన విషయం గుర్తుచేస్తూ.. ‘‘నన్ను అరెస్టు చేయించిన జగన్ కు ఇప్పుడు అధ్యక్షా అనడానికి నోరు రావడంలేదు. అందుకే ఆయన అసెంబ్లీకి రావడంలేదు. అసెంబ్లీ ఓ దేవాలయం. అందులో నేను పూజారిని మాత్రమే’’ అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.
Ayyanna Patrudu
YS Jagan
Andhra Pradesh Assembly
YSRCP
Opposition Status
Speaker Decision
Telugu News
AP Politics
Nallamilli Ramakrishna Reddy
Kutukuluru

More Telugu News