Chandrababu: రాష్ట్రంలో 50 ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం.. ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

Chandrababu Launches 50 MSME Parks in Andhra Pradesh
  • ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్న చంద్ర‌బాబు
  • రూ.810 కోట్ల పెట్టుబడులతో 900 ఎకరాల్లో పార్కుల ఏర్పాటు
  • ఈ పార్కుల ద్వారా 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
  • ఉత్పాదనకు సిద్ధమైన 28 కంపెనీలను కూడా ప్రారంభించనున్న సీఎం
  • "ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త" పారిశ్రామికవేత్త లక్ష్యంగా ప్రభుత్వ అడుగులు
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న 50 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్కులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పెదఈర్లపాడు నుంచి ఆయన వర్చువల్ విధానంలో ఈ పార్కులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

మొత్తం 900 ఎకరాల విస్తీర్ణంలో రూ.810 కోట్ల పెట్టుబడులతో ఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా రెండో దశ కింద 329 ఎకరాల్లో రూ.134 కోట్ల వ్యయంతో సిద్ధమైన 15 పారిశ్రామిక పార్కులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదే సమయంలో 587 ఎకరాల్లో కొత్తగా నిర్మించనున్న 32 ప్రభుత్వ, 3 ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు.

"ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త" లక్ష్యంతో ఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. స్థానికంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులకు అవకాశాలు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడులో 20 ఎకరాల్లో రూ.7 కోట్లతో అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ పార్కును కూడా సీఎం ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమంతో పాటు వివిధ పారిశ్రామిక పార్కుల్లో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని, ఉత్పాదనకు సిద్ధంగా ఉన్న 28 కంపెనీలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. రూ.25,696 కోట్ల భారీ పెట్టుబడితో ఈ సంస్థలు తమ యూనిట్లను నెలకొల్పాయి. వీటిలో ఉత్తరాంధ్రలో 8, కోస్తాంధ్రలో 6, దక్షిణ కోస్తాలో 6, రాయలసీమలో 8 సంస్థలు ఉన్నాయి. అనంతపురం, కాకినాడ, ప్రకాశం, కడప, విజయనగరం, సత్యసాయి, ఏలూరు, శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా సహా మొత్తం 17 జిల్లాల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి.
Chandrababu
Andhra Pradesh
MSME parks
industrial development
job opportunities
AP industries
small scale industries
Kanigiri
Pedairlapadu
AP government

More Telugu News