Delhi Blast: ఢిల్లీ పేలుడు ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు

Delhi Blast Investigation Reveals Key Details
  • ఢిల్లీ ఎర్రకోట వద్ద బాంబు పేలుడు కలకలం
  • పార్కింగ్‌లో ఉంచిన ఐ20 కారులోనే బాంబు అమర్చినట్టు అనుమానం
  • కారు యజమానిని అదుపులోకి తీసుకున్న అధికారులు
  • కేంద్ర ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో ముమ్మర దర్యాప్తు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ బాంబు పేలుడు సంభవించిన విష‌యం తెలిసిందే. ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి, దర్యాప్తును ముమ్మరం చేశారు.

సోమవారం సాయంత్రం 6.52 గంటలకు ఈ పేలుడు జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 24 మందికి తీవ్రగాయాలు కాగా, వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు తీవ్రతకు సుమారు 10 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

వెలుగులోకి కీలక అంశాలు 
ఈ పేలుడుకు సంబంధించి దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఓ ఐ20 కారులో బాంబు అమర్చినట్టు అనుమానిస్తున్నారు. ఈ కారు సోమవారం మధ్యాహ్నం 3.19 గంటలకు పార్కింగ్‌లోకి వచ్చి, సాయంత్రం 6.48 గంటలకు బయటకు వెళ్లిందని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. కారు బయటకు వెళ్లిన కొద్ది నిమిషాలకే పేలుడు సంభవించినట్టు అధికారులు నిర్ధారించారు.

కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడుకు ఉపయోగించిన కారు రిజిస్ట్రేషన్ నంబర్ HR26CE7674గా గుర్తించారు. ఇది గురుగ్రామ్ ఆర్టీవో కార్యాలయంలో మహమ్మద్ సల్మాన్ పేరు మీద రిజిస్టరై ఉంది. ఈ సమాచారం ఆధారంగా అధికారులు మహమ్మద్ సల్మాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, తాను ఆ కారును పుల్వామా నివాసి అయిన తారిక్‌కు అమ్మేసినట్టు సల్మాన్ విచారణలో తెలిపాడు. ఈ కేసును సీరియస్‌గా పరిగణిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు, అన్ని కోణాల్లోనూ విచారణను వేగవంతం చేశాయి.
Delhi Blast
Red Fort
Delhi
Bomb Blast
Gurugram RTO
Mohammad Salman
Tariq Pulwama
I20 Car
Explosion

More Telugu News