Rekha Gupta: పేలుడు ఘటనపై స్పందించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Rekha Gupta Reacts to Delhi Car Explosion Near Red Fort
  • మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన రేఖా గుప్తా
  • ఢిల్లీవాసులు అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి
  • పోలీసులు, అధికారుల నుంచి వచ్చే సమాచారం విశ్వసించాలన్న ఢిల్లీ సీఎం
ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందించారు. ఈ ఘటన విచారకరమని, బాధాకరమని, ఆందోళనకరమైనదని ఆమె అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు ఆమె తన సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

బాధితులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలు సహాయం అందుతుందని స్పష్టం చేశారు. సమగ్ర దర్యాప్తు కోసం ఢిల్లీ పోలీసులు, ఎన్ఎస్‌జీ, ఎన్ఐఏ, ఎఫ్ఎస్ఎల్ కలిసి పనిచేస్తాయని అన్నారు. ఢిల్లీవాసులు ఎలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని రేఖా గుప్తా విజ్ఞప్తి చేశారు. పోలీసులు, ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.

ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై రేవంత్ రెడ్డి స్పందన 

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అమానవీయ చర్య అని అన్నారు. ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇదిలా ఉండగా, పేలుడు ఘటనలో అమ్మోనియం నైట్రేట్‌ను సీఎన్జీ ట్యాంకులో పెట్టి పేల్చినట్లు ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రదేశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిశీలించారు. ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయినట్లు తెలిసిందని అన్నారు. పేలుడుకు గల కారణాలను ఇప్పుడే వెల్లడించలేమని తెలిపారు.
Rekha Gupta
Delhi car explosion
Red Fort blast
Revanth Reddy
Telangana CM
Amit Shah

More Telugu News