Chandrababu Naidu: పుట్టపర్తికి ప్రధాని మోదీ రాక నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు... సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu Naidu Reviews Puttaparthi Arrangements for Modi Visit
  • పుట్టపర్తి సత్యసాయి శత జయంతి వేడుకలకు ప్రధాని, రాష్ట్రపతి
  • ఈ నెల 19న నరేంద్ర మోదీ, 22న ద్రౌపది ముర్ము పర్యటన
  • ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
  • భక్తులకు సౌకర్యాలు, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం
  • పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలపై నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేసిన సీఎం
  • భక్తుల కోసం 682 రైళ్లు నడుపుతున్నట్లు తెలిపిన అధికారులు
పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ ఉత్సవాలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ నెల 19న ప్రధానమంత్రి, 22న రాష్ట్రపతి పుట్టపర్తి పర్యటన ఖరారైనందున భద్రతాపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్‌, ఇతర ఉన్నతాధికారులతో సత్యసాయి శత జయంతి వేడుకల నిర్వహణపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలన్నారు. ప్రధాని, రాష్ట్రపతి సహా ఇతర ప్రముఖుల పర్యటనలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రుల కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. పుట్టపర్తి పట్టణాన్ని సుందరంగా అలంకరించాలని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు.

భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు

సత్యసాయి మహాసమాధి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటం అధికారుల ప్రథమ కర్తవ్యమని సీఎం అన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు కేటాయించి, పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలు రాకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భక్తుల కోసం అవసరమైనన్ని ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు. ముందుజాగ్రత్త చర్యగా వైద్య సేవలను సిద్ధం చేయాలని, పుట్టపర్తి వ్యాప్తంగా 10 వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.

రవాణా, ఇతర ఏర్పాట్లపై అధికారుల నివేదిక

సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే చేపట్టిన చర్యలను అధికారులు సమావేశంలో వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా 250 మంది సిబ్బందిని నియమించామని, భక్తులకు తాగునీరు, ఆహారం, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, ఈ నెల 13 నుంచి డిసెంబర్ 1 వరకు 65 ప్రత్యేక రైళ్లతో సహా మొత్తం 682 రైళ్లను పుట్టపర్తికి నడుపుతున్నట్లు వివరించారు. పుట్టపర్తి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్‌కు భక్తుల సౌకర్యార్థం రోజుకు 20 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, సీఎస్ విజయానంద్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Puttaparthi
Sri Satya Sai Baba
Satya Sai Baba Centenary Celebrations
Narendra Modi
Droupadi Murmu
Andhra Pradesh
AP News
Centenary Celebrations
Puttaparthi Events

More Telugu News