విశాఖ సదస్సుతో ఏపీకి పెట్టుబడుల వరద... రూ.9.8 లక్షల కోట్ల ఒప్పందాలకు రంగం సిద్ధం!

  • ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు
  • రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులతో 410 ఒప్పందాలు కుదిరే అవకాశం
  • ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా
  • ఏపీలో అతిపెద్ద పీసీబీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న సిర్మా ఎస్‌జీఎస్
  • పెట్టుబడులను అడ్డుకునేందుకే జగన్ ధర్నాలకు పిలుపునిచ్చారని టీడీపీ విమర్శ
  • 17 నెలల కూటమి ప్రభుత్వ కృషికి ఈ సదస్సు నిదర్శనమని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ దశ, దిశను మార్చే చారిత్రక ఘట్టానికి విశాఖపట్నం వేదిక కానుందని, గత 17 నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం చేసిన అవిశ్రాంత కృషి ఈ నెల 14, 15 తేదీల్లో ఆవిష్కృతం కానుందని ఏపీ బయో డైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఎలక్ట్రానిక్స్ దిగ్గజం 'సిర్మా ఎస్‌జీఎస్' ముందుకు రావడం శుభపరిణామమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

చారిత్రక వేదికగా విశాఖ సదస్సు

"కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వారం ఒక ప్రత్యేక వారంగా నిలవనుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్యంతో జరగనున్న సదస్సు, రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతోంది. ఇది గత జగన్ రెడ్డి ప్రభుత్వంలా అంకెల గారడీతో చేసే సమ్మిట్ కాదు. ప్రతి కంపెనీతో ముందుగానే నేరుగా చర్చించి, పూర్తి అవగాహనతో ఈ సదస్సును నిర్వహిస్తున్నాం. గత మూడు నెలలుగా మంత్రులు వివిధ దేశాల్లో పర్యటించి, దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్ పర్యటనలు, రోడ్‌షోలు పెట్టుబడిదారుల్లో రాష్ట్రంపై బలమైన నమ్మకాన్ని కలిగించాయి. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, మానవ వనరుల గురించి వివరించి వారిని ఏపీకి ఆహ్వానించారు. ఆ ప్రయత్నాల ఫలితాలను ఇప్పుడు విశాఖ సదస్సులో చూడబోతున్నాం" అని విజయ్ కుమార్ వివరించారు.

ఈ సదస్సు ద్వారా సుమారు రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 410 ఒప్పందాలు కుదరనున్నాయని, తద్వారా 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సుమారు 20 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హాజరుకానుండటం, ఆంధ్రప్రదేశ్‌పై ప్రపంచ పెట్టుబడిదారులకు తిరిగి విశ్వాసం ఏర్పడిందనడానికి సంకేతమని అన్నారు. 

"గతంలో జగన్ కూడా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ పేరుతో డ్రామాలు ఆడారు. రూ.13 లక్షల కోట్ల ఒప్పందాలు అన్నాడు, అందులో రూ.9 లక్షల కోట్లు బినామీ ఒప్పందాలే. మిగిలినవి ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. కాలేజీ విద్యార్థులకు కోట్లు వేసి, బ్రోచర్లనే ఒప్పందాలుగా చూపించారు," అని ఆయన తీవ్రంగా విమర్శించారు.

విధ్వంసం నుంచి అభివృద్ధి వైపునకు ప్రయాణం

"యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. విశాఖను ఐటీ, ఏఐ హబ్‌గా మారుస్తున్నాం. రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ పాలసీతో కొత్త వెలుగులు నింపుతున్నాం. చంద్రబాబు దార్శనికత వల్లే కొన్ని ఉత్తరాంధ్ర జిల్లాల కన్నా రాయలసీమ జిల్లాల జీడీపీ పెరిగింది. విశాఖ, అనంతపురం, కర్నూలు, గన్నవరం వంటి ప్రాంతాలను పారిశ్రామిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం. ఇది కేవలం చంద్రబాబు, లోకేశ్ కృషి వల్లే సాధ్యమైంది" అని విజయ్ కుమార్ కొనియాడారు.

రాష్ట్రానికి వస్తున్న భారీ ప్రాజెక్టుల గురించి వివరిస్తూ, "విశాఖలో టీసీఎస్ భవన నిర్మాణం పూర్తికావొచ్చింది. గూగుల్ 15 బిలియన్ డాలర్లతో ఏఐ సిటీ నిర్మించనుండగా, 1.80 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ కంపెనీలు రూ.1.35 లక్షల కోట్లతో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నాయి. అమరావతిలో ఐబీఎం, టీసీఎస్ క్వాంటం వ్యాలీని నెలకొల్పనున్నాయి. అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా, పెట్టుబడుల వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం" అని తెలిపారు.

పెట్టుబడులను అడ్డుకుంటున్న జగన్

ఈ అభివృద్ధి యజ్ఞాన్ని, సీఐఐ సదస్సును పక్కదారి పట్టించేందుకే జగన్ ఈ నెల 12న పీపీపీ విధానంపై ధర్నాకు పిలుపునిచ్చారని విజయ్ కుమార్ ఆరోపించారు. "విశ్వామిత్రుని యాగానికి మారీచులు ఆటంకం కలిగించినట్లు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడు. కానీ, రామలక్ష్మణుల్లా చంద్రబాబు, లోకేశ్ ఈ పెట్టుబడుల యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తారు. పెట్టుబడులను ఆపడం జగన్ తరం కాదు. రాష్ట్రం ఇప్పుడే విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది" అని ఆయన అన్నారు.

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు నిదర్శనం

సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీస్ రూ.1,595 కోట్లతో రాష్ట్రంలో పీసీబీ తయారీ యూనిట్ పెట్టడంపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఈ ప్రాజెక్టుతో 2,170 మంది స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతులను వేగంగా అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ‘మాకు వేగం కావాలి, అందుకే ఏపీని ఎంచుకున్నాం’ అని సిర్మా ఎండీ జేఎస్ గుజ్రాల్ చెప్పడమే మంత్రి లోకేశ్ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నినాదానికి నిదర్శనం" అని విజయ్ కుమార్ పేర్కొన్నారు. 

ఈ పెట్టుబడితో దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ ఎకోసిస్టమ్ బలపడుతుందని, దిగుమతులు తగ్గుతాయని అన్నారు. చివరగా, ఇది రాష్ట్ర సమిష్టి ప్రగతికి సంబంధించిన విషయమని, వైసీపీ నేతలు కూడా ఈ సదస్సుకు సహకరించి, పెట్టుబడులపై విషం చిమ్మడం మానుకోవాలని హితవు పలికారు.


More Telugu News