Ayyanna Patrudu: జగన్ ఓ ఎమ్మెల్యే మాత్రమే... నన్ను 'అధ్యక్షా' అనలేకే సభకు రావట్లేదు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu Comments on Jagans Absence from Assembly
  • బయట కాదు, అసెంబ్లీలో మాట్లాడాలని జగన్‌కు అయ్యన్న సవాల్
  • వైసీపీది రాక్షస పాలన అంటూ ఘాటు విమర్శ
  • రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని ఆరోపణ
  • జీతాలు తీసుకుంటూ వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రావట్లేదని ఆగ్రహం
 వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనని, అసెంబ్లీలో స్పీకర్‌గా ఉన్న తనను 'అధ్యక్షా' అని సంబోధించడం ఇష్టం లేకపోవడం వల్లే సభకు హాజరు కావడం లేదని ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. బయట మీడియాతో మాట్లాడటం కాదని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని జగన్‌కు సవాల్ విసిరారు.

సోమవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తిలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగిన యాగంలో పాల్గొన్న అనంతరం అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. "సాధారణ ఎమ్మెల్యేకు సభలో ఎంత సమయం ఇస్తామో, జగన్‌కు కూడా అంతే ఇస్తాం. ఆయన వచ్చి మాట్లాడాలి. కానీ స్పీకర్ స్థానంలో ఉన్న నా ముందు నిలబడి మాట్లాడే ఇష్టం లేకే ఆయన సభకు రావట్లేదు" అని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. జగన్‌తో పాటు మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జీతాలు తీసుకుంటున్నప్పటికీ సభకు హాజరుకాకపోవడం దారుణమని విమర్శించారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనపై అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పూర్వకాలంలో రాక్షసుల నుంచి రాజ్యాన్ని కాపాడుకోవడానికి యాగాలు చేసేవారని, అలాంటి రాక్షస పాలనను గత ఐదేళ్లలో ఏపీ ప్రజలు చూశారని అన్నారు. జగన్‌కు అధికారం తెలుసు కానీ, పరిపాలన చేతకాలేదని విమర్శించారు. ఆయన మూర్ఖపు పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఖజానాను కొల్లగొట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ప్రజలు ఆ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అయ్యన్నపాత్రుడు తెలిపారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే వైసీపీ నేతలు పనిగట్టుకుని వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Ayyanna Patrudu
Jagan Mohan Reddy
YS Jagan
Andhra Pradesh Assembly
AP Assembly Speaker
Telugu Desam Party
YSRCP
AP Politics
Andhra Pradesh Politics
Assembly Sessions

More Telugu News