Harish Rao: రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా.. జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి ఓటేయాలో ముందే నిర్ణయించుకున్నారు: హరీశ్ రావు

Harish Rao Says Jubilee Hills Voters Decided Despite Revanth Reddy Dramas
  • కాంగ్రెస్ పార్టీ మద్యం, డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేస్తోందని ఆరోపణ
  • లక్షకు పైగా చీరలు, మిక్సీలను ఓటర్లకు ఎరగా వేస్తోందన్న హరీశ్ రావు
  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేసినట్లు వెల్లడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో ముందే నిర్ణయించుకున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్యం, డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేస్తోందని ఆయన ఆరోపించారు. లక్షకు పైగా చీరలు, మిక్సీలను ఓటర్లకు ఎరగా వేస్తోందని అన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అన్ని వీడియో, ఫొటోల ఆధారాలను ఎన్నికల సంఘానికి అందజేసినట్లు తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు చెప్పారు. సీ-విజిల్ యాప్‌లోనూ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఫిర్యాదు చేసినప్పటికీ కొందరు పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

జూబ్లీహిల్స్ ఓటర్లు అధికార పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హరీశ్ రావు అన్నారు. అధికార దుర్వినియోగంపై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ ఆయా బూత్‌ల వివరాలను సమర్పించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా మహిళా పోలీసు అధికారులు, ఆశా, అంగన్వాడీ వర్కర్లను ఆయా చోట్ల నియమించాలని కోరామని అన్నారు.

మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నకిలీ ఓటరు కార్డులు తయారు చేశారని, ఇందుకు సంబంధించిన వీడియోలను ఎన్నికల అధికారికి ఇచ్చినట్లు తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం నుంచి హామీ వచ్చినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో రేవంత్ రెడ్డి కాళ్లరిగేలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
Harish Rao
Revanth Reddy
Jubilee Hills
Telangana Elections
BRS Party
Congress Party

More Telugu News