నేపాల్, బంగ్లాదేశ్‌లలో... భారత్ చుట్టూ ఉగ్రవాద విస్తరణకు పాక్ కుట్ర

  • సరిహద్దులకు కొన్నికిలోమీటర్ల దూరంలో ఉగ్రస్థావరాల ఏర్పాటుకు సన్నాహాలు
  • ఆపరేషన్ సిందూర్ తర్వాత వేగవంతమైన కార్యకలాపాలు
  • సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచిన నిఘా వర్గాలు
భారత్ చుట్టూ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాకిస్థాన్ కుట్రలు పన్నుతుందని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం భారత సరిహద్దు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్ర నివాసాలు, శిక్షణ కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దులకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉగ్ర స్థావరాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్‌ను ఉటంకిస్తూ ఆంగ్ల మాధ్యమ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ కార్యకలాపాలు మరింత వేగవంతమైనట్లు తెలుస్తోంది. ఉగ్రవాద శిక్షణ పొందే వారి కోసం బంగ్లాదేశ్, నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో కొత్త శిక్షణ శిబిరాలు, నివాస సముదాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. సరిహద్దులోని రాష్ట్రాల్లో ఇటీవల ఉగ్రవాద సంస్థలకు చెందిన వారిని అరెస్టు చేయగా, వారి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. పొరుగు దేశాల్లో విదేశీ నిధులతో ఏర్పాటవుతున్న పలు ప్రాజెక్టులపై కూడా నిఘా ఉంచినట్లు పేర్కొన్నాయి. లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు నేపాల్‌లో తమ సంస్థలను విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆల్-ఖైదా, ఐసిస్ గత ఐదు నెలలుగా బంగ్లాదేశ్‌లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయని తెలిపాయి.

ఇందులో భాగంగా పాక్‌లోని పలు ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్‌కు, నేపాల్‌కు నిరంతర వలసలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి. ఆయా దేశాల్లో ఉగ్రవాద శిబిరాల నిర్మాణాలకు, నిర్వహణకు అవసరమైన నిధులను టర్కీ సమకూరుస్తున్నట్లు సమాచారం. ఢాకాలోని జమాత్-ఈ-ఇస్లామీ కార్యాలయం పునరుద్ధరణకు టర్కీ నిఘా సంస్థ నిధులు సమకూర్చినట్లు కూడా ఈ నిఘా వర్గాలు వెల్లడించాయి.


More Telugu News