KA Paul: కేఏ పాల్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

KA Paul Faces Supreme Court Ire Over PIL
  • ఏపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై పిటిషన్ దాఖలు చేసిన పాల్
  • పబ్లిసిటీ కోసమే పిటిషన్ వేశారంటూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు
  • ముందుగా సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని స్పష్టం
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ప్రచారం కోసమే ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారంటూ కేఏ పాల్ నేరుగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం, కేఏ పాల్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

"ఇలాంటి విషయాలపై ముందుగా సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలి. అది చేయకుండా నేరుగా సుప్రీంకోర్టుకు రావడం ఏమిటి? కేవలం పబ్లిసిటీ కోసమే మీరు ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారు" అంటూ ధర్మాసనం పాల్‌పై మండిపడింది. ఈ తరహా పిటిషన్లతో న్యాయవ్యవస్థ విలువైన సమయం వృథా అవుతోందని అభిప్రాయపడింది.

చట్టపరమైన మార్గాలను అనుసరించకుండా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సరికాదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరపడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు, ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లాలని కేఏ పాల్‌కు సూచించింది. 
KA Paul
Praja Shanti Party
Supreme Court
PIL
Andhra Pradesh
Medical Colleges Privatization
High Court
Publicity Stunt
Justice Surya Kant
Petition Dismissed

More Telugu News