Nara Lokesh: ఫస్ట్ టైం ఎమ్మెల్యేలపై మంత్రి నారా లోకేశ్ అసహనం

Nara Lokesh Expresses Displeasure Over First Time MLAs
  • కొంతమందికి మంచీచెడు తెలియట్లేదన్న మంత్రి
  • వారికి సీనియర్‌ ఎమ్మెల్యేలు అవగాహన కల్పించాలని సూచన
  • ఉండవల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో మంత్రులతో భేటీ
తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పలువురు నేతలు అవగాహనరాహిత్యంతో ప్రవర్తిస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. వారి తీరులో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అన్నారు. కొత్త ఎమ్మెల్యేలు కొంతమందికి మంచీచెడు తెలియడంలేదని, సీనియర్ ఎమ్మెల్యేలు వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో జరిగిన భేటీలో నారా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని ఎలా అధిగమించి ఈ స్థాయికి వచ్చారనే విషయాలపై అవగాహన కల్పించాలని సీనియర్ ఎమ్మెల్యేలకు లోకేశ్ చెప్పారు. వరుస విజయాలు సాధించాలంటే లోటుపాట్లు సరిచేసుకోవాలని కొత్త ఎమ్మెల్యేలకు హితవు పలికారు.

ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా నిర్వహించ తలపెట్టిన పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయాలని మంత్రులకు నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా ఏపీకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడుల విషయంలో ప్రతీ మంత్రి తమ తమ శాఖల పరిధిలో ఒప్పందాలపై బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని లోకేశ్ సూచించారు.

రేపు (మంగళవారం) నిర్వహించే ఎంఎస్‌ఎంఈ పార్కుల కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని మంత్రులకు సూచించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీని వేగంగా నెరవేర్చేందుకు కృషి చేద్దామని మంత్రి లోకేశ్ చెప్పారు.
Nara Lokesh
AP Minister
First Time MLAs
Andhra Pradesh Politics
Investment Summit
Visakhapatnam
MSME Parks
Job Creation
Andhra Pradesh Investments

More Telugu News