Mariam Cisse: మాలిలో దారుణం: టిక్‌టాక్ స్టార్‌ను బహిరంగంగా కాల్చి చంపిన జిహాదీలు

Mariam Cisse TikTok Star Publicly Executed by Jihadists in Mali
  • మాలిలో టిక్‌టాక్ స్టార్ మరియమ్ సిస్సే దారుణ హత్య
  • సైన్యానికి గూఢచారిగా పనిచేస్తోందని ఆరోపించిన జిహాదీలు
  • గురువారం కిడ్నాప్ చేసి, శుక్రవారం బహిరంగంగా కాల్చివేత
  • ఉత్తర మాలిలోని టోంకా నగరంలో ఘటన
పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో జిహాదీ ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్ చేస్తూ పాప్యులర్ అయిన ఒక యువతిని కిడ్నాప్ చేసి, బహిరంగంగా కాల్చి చంపారు. సైన్యానికి గూఢచారిగా పనిచేస్తోందన్న ఆరోపణలతో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

ఉత్తర మాలిలోని టింబక్టు ప్రాంతంలోని టోంకా నగరానికి చెందిన మరియమ్ సిస్సే అనే యువతి టిక్‌టాక్‌లో స్థానిక విశేషాలపై వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు సుమారు 90 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, గురువారం కొందరు జిహాదీలు ఆమెను అపహరించారు. మాలి సైన్యంకు తమ కదలికల గురించి ఆమె సమాచారం చేరవేస్తోందని ఆరోపించారు.

ఆ మరుసటి రోజే అంటే శుక్రవారం మరియమ్‌ను ఒక మోటార్‌బైక్‌పై టోంకా నగరంలోని ఇండిపెండెన్స్ స్క్వేర్‌కు తీసుకొచ్చారు. అక్కడి జనసమూహం చూస్తుండగానే ఆమెను తుపాకీతో కాల్చి చంపారు. "వారు నా సోదరిని చంపేటప్పుడు నేను ఆ గుంపులోనే ఉన్నాను" అని ఆమె సోదరుడు ఆవేదనతో వెల్లడించారు.

ఈ ఘటనను ఓ భద్రతా అధికారి ధ్రువీకరించారు. "మాలి సైన్యం కోసం జిహాదీలను వీడియో తీస్తోందని ఆరోపిస్తూ మరియమ్ సిస్సేను బహిరంగంగా హత్య చేశారు. ఇది అత్యంత అనాగరికమైన చర్య" అని ఆయన పేర్కొన్నారు. స్థానిక అధికారులు కూడా ఈ హత్యను "నీచమైన చర్య"గా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించారు.

2012 నుంచి మాలి దేశం జిహాదీ ఉగ్రవాదంతో పోరాడుతోంది. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న సైనిక ప్రభుత్వం ఈ తిరుగుబాటును అణచివేయడంలో తీవ్రంగా శ్రమిస్తోంది. ఇటీవలే అల్-ఖైదాతో సంబంధాలున్న జేఎన్ఐఎం  అనే ఉగ్రవాద సంస్థ దేశంలో ఇంధన దిగ్బంధనం విధించింది. దీనివల్ల పలు ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడటంతో పాటు పంటల కోతలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఈ దారుణ హత్య దేశంలోని భద్రతా పరిస్థితులకు అద్దం పడుతోంది.
Mariam Cisse
Mali
TikTok star
Jihadi
Timbuktu
JNIM
Terrorism
West Africa
Social media
Guerilla warfare

More Telugu News