Harmanpreet Kaur: ప్రపంచకప్ గెలిచినా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలా?.. హర్మన్‌పై మాజీ కెప్టెన్ వ్యాఖ్యల దుమారం

Anjum Chopra Reacts to Harmanpreet Captaincy Comments
  • మహిళల వన్డే ప్రపంచకప్ తొలిసారి గెలిచిన టీమిండియా
  • హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న మాజీ కెప్టెన్ శాంత రంగస్వామి
  • బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టాలంటూ సూచన
  • శాంత వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన అంజుమ్ చోప్రా
  • గెలిచినా, ఓడినా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని విమర్శ
  • హర్మన్ గొప్ప మ్యాచ్ విన్నర్ అని, కెప్టెన్‌గా సరైన ఎంపిక అని వెల్లడి
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తమ దశాబ్దాల కలను సాకారం చేసుకుంటూ తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి హర్మన్‌ప్రీత్ కౌర్ సేన చారిత్రక విజయాన్ని అందుకుంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి క్రీడాకారుణుల సమష్టి కృషితో ఈ అద్భుత విజయం సాధ్యమైంది. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటగా, ప్రధాని నరేంద్ర మోదీ సైతం జట్టు సభ్యులను స్వయంగా కలిసి అభినందించారు.

ఈ ఆనందకర వాతావరణంలో, భారత మాజీ కెప్టెన్ శాంత రంగస్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ ఇక కెప్టెన్సీ నుంచి తప్పుకుని, తన బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై మరింత దృష్టి సారించాలని ఆమె సూచించారు. జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఈ మార్పు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై క్రీడా వర్గాలు, అభిమానుల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.

అయితే, శాంత రంగస్వామి వ్యాఖ్యలపై మరో మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీటీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆమె ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. "ప్రతి ప్రపంచకప్ తర్వాత ఇలాంటి ఒక ప్రకటన రావడం మామూలే. గత నాలుగు, ఐదు వరల్డ్ కప్‌లను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. భారత్ ఓడితే హర్మన్‌ను కెప్టెన్సీ నుంచి తీసేయమంటారు, ఇప్పుడు గెలిచినా కూడా అదే మాట అంటున్నారు" అని అంజుమ్ అన్నారు.

భారత్ చారిత్రక విజయం సాధించిన ఈ తరుణంలో ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడి ఆనందాన్ని పాడుచేయదలచుకోలేదని ఆమె స్పష్టం చేశారు. హర్మన్‌ప్రీత్, అంజుమ్ చోప్రా మధ్య మంచి అనుబంధం ఉంది. కప్ గెలిచిన తర్వాత కూడా తన కెరీర్ తొలినాళ్లలో అంజుమ్ ఇచ్చిన మద్దతును హర్మన్ గుర్తుచేసుకున్నారు.

హర్మన్‌ప్రీత్ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ "తొలిసారి దేశవాళీ క్రికెట్‌లో చూసినప్పుడే ఆమె ప్రతిభను నేను గుర్తించాను. 2007-08లో ఆమె అండర్-19 ప్లేయర్‌గా ఉన్నప్పుడే బంతిని ఎంత బలంగా బాదగలదో చూశాను. ఆమె ఒక ప్రత్యేకమైన క్రీడాకారిణి అని నాకు అప్పుడే అర్థమైంది. హర్మన్ ఒక గొప్ప మ్యాచ్ విన్నర్ అని నేను మొదటి రోజు నుంచి నమ్ముతున్నాను. అందుకే ఆమె కెప్టెన్‌గా ఉండాలని నేను ఎప్పుడూ బలంగా కోరుకున్నాను" అని అంజుమ్ వివరించారు.
Harmanpreet Kaur
Indian Women's Cricket
ICC World Cup
Shantha Rangaswamy
Anjum Chopra
Cricket Captaincy
Women in Sports
Smriti Mandhana
Cricket News
Deepti Sharma

More Telugu News