Javed Inamdar: విమానంలో బాలికపై లైంగిక దాడి.. భారతీయుడికి 21 నెలల జైలు శిక్ష

Indian Man Javed Inamdar Jailed in UK for Child Sexual Assault on Plane
  • ముంబై-లండన్ విమానంలో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి  
  • నిందితుడు జావేద్ ఇనామ్‌దార్‌కు 21 నెలల జైలు శిక్ష విధించిన యూకే కోర్టు
  • భార్య అనుకుని పొరపడ్డానన్న వాదనను తీవ్రంగా ఖండించిన న్యాయమూర్తి
  • బాధితురాలు తీవ్ర భయాందోళనలకు గురైందని తెలిపిన విమాన సిబ్బంది
  • కోర్టు విచారణలో కన్నీళ్లు పెట్టుకున్న నిందితుడు
  • ఇలాంటి వారి నుంచి చిన్నారులను కాపాడాల్సిన బాధ్యత ఉందని జడ్జి వ్యాఖ్య
విమానంలో ప్రయాణిస్తున్న 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ భారతీయుడికి యూకే కోర్టు 21 నెలల జైలు శిక్ష విధించింది. ముంబైకి చెందిన షిప్పింగ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ జావేద్ ఇనామ్‌దార్ (34) ఈ దారుణానికి ఒడిగట్టాడు. 2024 డిసెంబర్ 14న ముంబై నుంచి లండన్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

‘ది సన్’ పత్రిక కథనం ప్రకారం నిందితుడు జావేద్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. విమానంలో తన పక్క సీట్లో నిద్రిస్తున్న బాలిక పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించాడు. మొదట ఆమె చేతిని నిమిరి, ఆ తర్వాత ఆమె దుస్తుల్లో చేయి పెట్టాడు. దీంతో ఉలిక్కిపడి నిద్రలేచిన ఆ బాలిక "నా దగ్గరి నుంచి వెళ్ళిపో" అంటూ గట్టిగా అరుస్తూ ఏడ్చేసింది.

వెంటనే స్పందించిన విమాన సిబ్బంది, బాలికను విచారించగా జరిగిన విషయం చెప్పింది. క్యాబిన్ మేనేజర్ రెబెక్కా రూనీ కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలిక తీవ్ర భయాందోళనతో కనిపించింది. మోకాళ్లను చాతీకి అదుముకుని తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తోందని ఆమె వివరించారు. నిందితుడిని ప్రశ్నించగా, తన భార్య అనుకుని పొరపాటున తాకినట్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

ఐల్స్‌వర్త్ క్రౌన్ కోర్టులో జరిగిన విచారణలో నిందితుడు హిందీ అనువాదకుడి సహాయం తీసుకున్నాడు. విచారణ జరుగుతున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాడు. అతని తరఫు న్యాయవాది వాదిస్తూ.. "అతను భారతదేశంలోని భిన్నమైన సంస్కృతి నుంచి వచ్చాడు. బెయిల్‌పై ఇక్కడే ఉండటం వల్ల తన భార్యాపిల్లలను కలుసుకోలేకపోయాడు. అతడి శిక్షను నిలిపివేస్తే వెంటనే దేశం విడిచి వెళ్లిపోతాడు" అని కోర్టుకు విన్నవించారు.

అయితే, ఈ వాదనలను జడ్జి సైమన్ డేవిస్ తీవ్రంగా ఖండించారు. "భార్య అనుకున్నాననే వాదన నమ్మశక్యంగా లేదు. ఇది దారుణమైన చర్య. ఇలాంటి వారి నుంచి ఈ దేశం చిన్నారులను కచ్చితంగా కాపాడుతుంది. బాధితురాలు భయంతో కేకలు వేయగానే తప్పించుకోవడానికి కథలు అల్లావు" అని వ్యాఖ్యానించారు. నిందితుడు చాలాకాలంగా తన కుటుంబానికి దూరంగా యూకేలో ఉండటాన్ని మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకుని శిక్షను కొంత తగ్గించినట్లు తెలిపారు. విచారణ అనంతరం ఇనామ్‌దార్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు, అతనికి 21 నెలల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది.
Javed Inamdar
UK court
sexual assault
British Airways
Mumbai to London flight
child abuse
Indian citizen
prison sentence
Isleworth Crown Court
flight attendant

More Telugu News