Revanth Reddy: కేసీఆర్ బాధతో కుమిలిపోతున్నారు... ఆయనను చూస్తుంటే సానుభూతి కలుగుతోంది: రేవంత్ రెడ్డి

Revanth Reddy Comments on KCRs Condition and BRS Future
  • బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అన్న రేవంత్ రెడ్డి
  • ఆ పార్టీ వ్యాలిడిటీ పీరియడ్ ముగిసిపోయిందని వ్యాఖ్య
  • కేసీఆర్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదన్న సీఎం
బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని, దాని వ్యాలిడిటీ పీరియడ్ అయిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయ విమర్శల కోసం ఈ మాటలు చెప్పడం లేదని, ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎలా కనుమరుగైందో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అలాగే మారుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌తోనే ఆ పార్టీ ప్రస్థానం ముగిసిపోతుందని అన్నారు. 

కేసీఆర్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని, ఆ బాధతోనే ఆయన ఇంటి నుంచి బయటకు రావడం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ ఇప్పటివరకు ప్రజలను కోరకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. "ఆరోగ్య సమస్యల వల్ల ఆయన ప్రచారానికి రాలేకపోవచ్చు. కానీ, కనీసం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఒక ప్రకటన కూడా ఇవ్వడం లేదు. దీన్నిబట్టి కేటీఆర్, హరీశ్‌రావుపై ఆయనకు ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు" అని వ్యాఖ్యానించారు. తన కళ్ల ముందే పార్టీ కూలిపోతుంటే కేసీఆర్ దుఃఖంతో కుమిలిపోతున్నారని, ఆయన్ను ప్రత్యర్థిగా కాకుండా సానుభూతితో చూడాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ సహకారం వల్లే బీజేపీ 8 సీట్లు గెలుచుకుందని, ఆ సీట్లే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడానికి ఉపయోగపడ్డాయని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైందని కేసీఆర్ కుమార్తె కవితే స్వయంగా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

2004 నుంచి 2014 వరకు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే రైతుల సంక్షేమానికి, హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలు రావడానికి నాటి సీఎల్పీ నేత పీజేఆర్ చేసిన పోరాటమే కారణమని గుర్తుచేశారు. ఐటీ, ఫార్మా హబ్‌గా హైదరాబాద్ మారడానికి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే పునాది వేశాయన్నారు. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలతో సంక్షేమం, అభివృద్ధిని కాంగ్రెస్ సమన్వయం చేసిందని పేర్కొన్నారు. ఈ చరిత్ర కేసీఆర్ చెరిపేస్తే చెరిగిపోయేది కాదన్నారు. ఆనాటి పదేళ్ల కాంగ్రెస్ పాలనను, కేసీఆర్ పదేళ్ల పాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Revanth Reddy
KCR
BRS
Telangana
Congress
BJP
Jubilee Hills by election
Lok Sabha elections
Hyderabad development
Kavitha

More Telugu News