Kempegowda International Airport: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో నమాజ్.. కర్ణాటకలో రాజుకున్న కొత్త వివాదం

Kempegowda International Airport Namaz Sparks Controversy in Karnataka
  • హై సెక్యూరిటీ జోన్‌లో ఎలా అనుమతించారని బీజేపీ ప్రశ్న
  • ఇది భద్రతాపరమైన అంశం కాదా? అని నిలదీత
  • కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని విమర్శ
  • ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకే ఇలాంటి చర్యలని ఆరోపణ
  • సీఎం సిద్ధరామయ్య, మంత్రి ప్రియాంక్ ఖర్గే సమాధానం చెప్పాలని డిమాండ్
కర్ణాటకలో మరో కొత్త వివాదం రాజుకుంది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో కొందరు నమాజ్ చేయడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హై సెక్యూరిటీ జోన్‌లో ఇలాంటి వాటికి ఎలా అనుమతి ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పష్టతనివ్వాలని డిమాండ్ చేసింది.

ఈ ఘటన కెంపెగౌడ విమానాశ్రయంలోని టెర్మినల్ 2లో జరిగినట్లు బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోను ఆదివారం రాత్రి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "హై సెక్యూరిటీ జోన్‌లో నమాజ్ చేయడానికి వీరు ముందస్తు అనుమతి పొందారా? ఇది అత్యంత సున్నితమైన ప్రాంతంలో తీవ్రమైన భద్రతా సమస్య కాదా?" అని ఆయన ప్రశ్నించారు. "ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుని పథ సంచలన్ నిర్వహిస్తే అభ్యంతరం చెప్పే ప్రభుత్వం, ఇలాంటి కార్యకలాపాలను ఎందుకు చూసీచూడనట్లు వదిలేస్తోంది?" అని ఆయన విమర్శించారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని తప్పుబట్టారు. "టెర్మినల్ 2లో భారీ భద్రత ఉంటుంది. కానీ పోలీసులు గానీ, ఇతర సిబ్బంది గానీ వారిని ఆపడానికి ప్రయత్నించలేదు. ఇది ఒక వర్గాన్ని సంతృప్తిపరిచే కాంగ్రెస్ ప్రభుత్వ తీరును స్పష్టం చేస్తోంది. ఈ చర్యను సీఎం, ఐటీ మంత్రి సమర్థిస్తారా?" అని విజయ్ ప్రసాద్ ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా, బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రైవేటు సంస్థలు అనుమతి తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశం కేవలం ఆర్ఎస్ఎస్‌ను లక్ష్యంగా చేసుకున్నది కాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల స్పష్టం చేశారు. "ఆ ఉత్తర్వుల్లో మేము ఎక్కడా ఆర్ఎస్ఎస్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఏ సంస్థ అయినా కార్యక్రమం నిర్వహించాలంటే జిల్లా అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. దాన్ని వారు ఆర్ఎస్ఎస్ గురించి అనుకుంటే మేమేం చేయగలం?" అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ లేని సంస్థ అని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పరోక్షంగా స్పందిస్తూ, తమ సంస్థ "వ్యక్తుల సమూహంగా" గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.
Kempegowda International Airport
Bangalore Airport
Namaz
Karnataka politics
BJP
Siddaramaiah
Priyank Kharge
Vijay Prasad
RSS
Airport security

More Telugu News