Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఆదేశాల ఎఫెక్ట్.. బెంగళూరులో డ్రగ్స్ డాన్ మడ్డి అరెస్ట్

Andhra Pradesh Police Arrest Drugs Don Maddi in Bangalore
  • తెలుగు రాష్ట్రాల్లో యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మడ్డి
  • సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు
  • విచారణ నిమిత్తం ఎపీకి నిందితుడి తరలింపు
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ మహమ్మారిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన యుద్ధంలో పోలీసులకు కీలక విజయం లభించింది. సీఎం ఆదేశాలతో డ్రగ్స్ ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టిన ఏపీ పోలీసులు, మోస్ట్ వాంటెడ్ డ్రగ్ తయారీదారు మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు చెందిన మధుసూదన్ రెడ్డి, బెంగళూరు కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కదలికలపై కొంతకాలంగా నిఘా ఉంచిన పోలీసులు, పక్కా సమాచారంతో బెంగళూరులో అతడిని పట్టుకున్నారు.

గత సెప్టెంబర్ నెలలో బెంగళూరు నుంచి విశాఖపట్నంకు డ్రగ్స్ తరలిస్తున్న శ్రీవాత్సవ్, హవి అనే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో మడ్డి పేరు బయటకు వచ్చింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఎట్టకేలకు అతడిని అరెస్ట్ చేయడంతో ఈ కేసులో కీలక పురోగతి లభించినట్లయింది.

ప్రస్తుతం మడ్డిని విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారు. అతడిని విచారిస్తే డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు, సూత్రధారుల వివరాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు కొనసాగుతాయని పోలీసు వర్గాలు తెలిపాయి.

Chandrababu Naidu
Andhra Pradesh
drugs case
Maddi alias Madhusudhan Reddy
Bangalore drugs
drug mafia
Visakhapatnam
Vijayawada
drug trafficking
cyberabad drugs case

More Telugu News