Krishna Veni: వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త

Sangareddy Husband Kills Wife with Cricket Bat Suspecting Affair
  • మృతురాలు డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్
  • తరచూ గొడవల వల్లే ఈ ఘోరం జరిగినట్లు వెల్లడి
  • భర్త బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
అనుమానం ఓ కాపురంలో చిచ్చు పెట్టింది. భార్యపై వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త ఆమెను అతి కిరాతకంగా క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఎస్‌ఆర్ నగర్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన చెవుల బ్రహ్మయ్య, కృష్ణవేణి (37) దంపతులు కొంతకాలంగా అమీన్‌పూర్‌లో నివసిస్తున్నారు. కృష్ణవేణి కోహిర్‌లోని డీసీసీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వీరికి ఇంటర్ చదువుతున్న కుమార్తె, 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు.

కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకోవడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. ఇదే క్రమంలో ఆదివారం ఉదయం మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన బ్రహ్మయ్య.. ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్‌తో కృష్ణవేణి తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ నరేశ్ తెలిపారు.  
Krishna Veni
Sangareddy
Adultery
Murder
Crime news
Telangana
Ameenpur
Husband killed wife
Cricket bat
KSR Nagar

More Telugu News