ఒక్కరోజే మూడు ఆలయాలకు అంబానీ భారీ విరాళాలు.. తిరుమలకు రూ.100 కోట్లు

  • రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భారీ విరాళాలు
  • తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు రూ.100 కోట్ల విరాళం
  • 2 లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా కొత్త వంటశాల
  • రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాకు రూ.50 కోట్లకు పైగా విరాళం
  • కేరళలోని గురువాయూర్ ఆస్పత్రికి తొలి విడతగా రూ.15 కోట్లు
  • ఒక్కరోజే మూడు ప్రముఖ ఆలయాలను సందర్శించిన అంబానీ
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఆదివారం ఒక్కరోజే మూడు ప్రముఖ ఆలయాలను సందర్శించి, ప్రజాసేవ కార్యక్రమాల కోసం భారీ విరాళాలు ప్రకటించారు. తిరుమల, కేరళలోని గురువాయూర్‌, రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా ఆలయాలకు ఆయన రూ.165 కోట్లకు పైగా విరాళాలను ప్రకటించి వార్తల్లో నిలిచారు.

వివరాల్లోకి వెళితే... ఆదివారం వేకువజామున సుప్రభాత సేవ అనంతరం ముఖేశ్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో నిత్యం 2 లక్షల మందికి అన్నప్రసాదాలు తయారు చేసేందుకు వీలుగా, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త శాటిలైట్ కిచెన్ (వంటశాల) నిర్మాణానికి రూ.100 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ కొత్త వంటశాలను అన్నప్రసాదం ట్రస్టుకు అంకితం చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావడం తమకు లభించిన మహాభాగ్యమని రిలయన్స్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

అనంతరం ఆయన రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా ఆలయాన్ని సందర్శించారు. అక్కడ భక్తుల సౌకర్యార్థం యాత్రికుల సముదాయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. రానున్న మూడేళ్లలో పూర్తికానున్న ఈ ప్రాజెక్టు కోసం రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.15 కోట్లను విరాళంగా అందజేశారు.

అలాగే కేరళలోని గురువాయూర్‌ శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి తనవంతు సహాయం ప్రకటించారు. తొలి విడతగా రూ.15 కోట్ల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఒకే రోజు మూడు ఆలయాల్లో అన్నదానం, వసతి, వైద్యం వంటి సేవా కార్యక్రమాలకు అంబానీ భారీగా విరాళాలు ఇవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News