Japan Earthquake: జపాన్ లో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ

Japan Earthquake Triggers Tsunami Warning
  • జపాన్ ఈశాన్య తీరంలో 6.7 తీవ్రతతో భారీ భూకంపం
  • ఇవాతె రాష్ట్రానికి సునామీ హెచ్చరికలు జారీ
  • కొన్ని ప్రాంతాల్లో ఎగిసిన సునామీ అలలు
  • తాత్కాలికంగా నిలిచిపోయిన బుల్లెట్ రైలు సర్వీసులు
  • ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రధాని సూచన
  • అణు విద్యుత్ కేంద్రానికి ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడి
జపాన్‌లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. దేశ ఈశాన్య ప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్రంలో రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా, బుల్లెట్ రైలు సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

జపాన్ వాతావరణ సంస్థ (JMA) వెల్లడించిన వివరాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:03 గంటలకు సంరికు తీరానికి సమీపంలో, సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం కారణంగా ఇవాతె రాష్ట్ర తీరాన్నిమీటరు ఎత్తు వరకు సునామీ అలలు తాకే ప్రమాదం ఉందని వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఒఫునాటోలో 10 సెంటీమీటర్ల ఎత్తున, మియాకోలో ఓ మోస్తరు అలలు తీరాన్ని తాకినట్లు అధికారులు తెలిపారు.

భూకంపం కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన తొహోకు షింకన్‌సెన్ బుల్లెట్ రైలు సర్వీసులను కొద్దిసేపటికే పునరుద్ధరించినట్లు ఆపరేటర్ జేఆర్ ఈస్ట్ ప్రకటించింది.

ఈ ఘటనపై జపాన్ ప్రధాని సనాయె తకైచి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. "సునామీ హెచ్చరిక జారీ చేయబడింది, కాబట్టి దయచేసి వెంటనే తీరం నుంచి దూరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి. ఊహించిన దాని కంటే పెద్ద సునామీ రావచ్చు, కాబట్టి తదుపరి సమాచారం కోసం అప్రమత్తంగా ఉండండి. భూకంపం తర్వాత కూడా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది" అని ఆమె ప్రజలను హెచ్చరించారు.

మియాగి రాష్ట్రంలోని ఒనగావా అణు విద్యుత్ కేంద్రంలో ఎలాంటి నష్టం నమోదు కాలేదని, ప్లాంట్‌కు ఎటువంటి ప్రమాదం లేదని తొహోకు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ స్పష్టం చేసింది. అయితే, రానున్న కొద్ది రోజుల్లో ఇదే తీవ్రతతో లేదా అంతకంటే శక్తివంతమైన భూకంపాలు సంభవించే ప్రమాదం ఉందని, సునామీ హెచ్చరికలున్న ప్రాంతాల్లో ప్రజలు సముద్ర తీరానికి వెళ్లవద్దని వాతావరణ సంస్థ అధికారి ఒకరు మీడియా సమావేశంలో సూచించారు.
Japan Earthquake
Earthquake
Tsunami warning
Japan
Sanaye Takaichi
Tohoku Shinkansen
Pacific Ocean
Iawate Prefecture
JR East

More Telugu News