V Kaveri Travels: తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సు బ్రేక్‌డౌన్ .. ప్రయాణికులకు 5 గంటల నరకం

V Kaveri Travels Bus Breakdown near Bapatla Strands Passengers
  • బాపట్ల జిల్లా ఏల్చూరు వద్ద 5 గంటలు నిలిచిపోయిన వాహనం
  • అర్ధరాత్రి నడిరోడ్డుపై మహిళలు, చిన్నారుల తీవ్ర ఇబ్బందులు
  • పట్టించుకోని యాజమాన్యం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయాణికులు
  • రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు సుమారు 5 గంటల పాటు నరకయాతన అనుభవించారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆగిపోవడంతో మహిళలు, చిన్నారులతో సహా 36 మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. వీ కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు 36 మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్దకు రాగానే బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బస్సు ఒక్కసారిగా నడిరోడ్డుపై నిలిచిపోయింది. ఏం జరిగిందో తెలియక డ్రైవర్లు వెంటనే తమ యాజమాన్యానికి సమాచారం అందించారు.

ప్రయాణికులు ఆందోళనతో డ్రైవర్లను ప్రశ్నించగా, చిన్న సమస్యేనని, త్వరలోనే సరిచేసి బయలుదేరుతామని చెప్పారు. సమస్య పరిష్కారం కాకపోతే మరో బస్సును ఏర్పాటు చేస్తామని నచ్చజెప్పారు. దీంతో ప్రయాణికులు బస్సులోనే నిద్రకు ఉపక్రమించారు. అయితే, గంటలు గడుస్తున్నా బస్సు కదలలేదు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదు. తెల్లవారుజాము కావస్తున్నా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికుల సహనం నశించింది.

ముఖ్యంగా మహిళలు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడ్డారు. చేసేదేమీ లేక చివరకు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ట్రావెల్స్ యాజమాన్యంతో మాట్లాడి ప్రయాణికులను వేర్వేరు బస్సుల్లో వారి గమ్యస్థానాలకు పంపించారు. బాధితులకు టికెట్ ఛార్జీలను వాపసు ఇప్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 
V Kaveri Travels
Tirupati
Hyderabad
bus breakdown
private travels
Bapatla district
travel inconvenience
passenger safety
Andhra Pradesh
road accident

More Telugu News