లడ్డూ నెయ్యి కల్తీ కేసులో వైవీ సుబ్బారెడ్డి పాత్రపై సిట్ అనుమానం.. హైకోర్టుకు కీలక నివేదిక

  • శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ కేసులో మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదం
  • హైకోర్టుకు నివేదిక సమర్పించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)
  • కల్తీ అని తేలినా కంపెనీలపై చర్యలు తీసుకోలేదని ఆరోపణ
  • పైగా అవే కంపెనీలకు నెయ్యి సరఫరాకు అనుమతిచ్చారని వెల్లడి
  • సుబ్బారెడ్డి, ఆయన అర్ధాంగి బ్యాంకు ఖాతాల వివరాలు కోరుతున్న సిట్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంలో టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) హైకోర్టుకు స్పష్టం చేసింది. నెయ్యి సరఫరా చేసిన కంపెనీల ఉత్పత్తుల్లో కల్తీ జరిగినట్లు ప్రయోగశాల నివేదికలు స్పష్టం చేసినప్పటికీ, సుబ్బారెడ్డి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, తిరిగి సరఫరాకు అనుమతించారని సిట్ తన నివేదికలో పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సుబ్బారెడ్డి, ఆయన అర్ధాంగి స్వర్ణలతారెడ్డి బ్యాంకు ఖాతాల వివరాలను పరిశీలించాల్సి ఉందని, వారి పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును కోరింది.

సిట్ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ ప్రకారం, 2019-23 మధ్య సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ సమయంలో ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌, వైష్ణవి డెయిరీ, భోలేబాబా డెయిరీ సంస్థలు సరఫరా చేసిన నెయ్యి నమూనాలను మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌కు పంపగా, వాటిలో వెజిటెబుల్ ఆయిల్ కలిపినట్లు 2022 ఆగస్టులో నివేదిక వచ్చింది. ఈ విషయాన్ని అధికారులు ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన ఆ కంపెనీలను బ్లాక్‌లిస్టులో పెట్టకుండా, 2024 వరకు సరఫరాకు అనుమతులు ఇచ్చారని సిట్ వివరించింది.

ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్లు దర్యాప్తులో తేలింది. భోలేబాబా డెయిరీ డైరెక్టర్ పోమిల్‌ జైన్‌, సుబ్బారెడ్డిని కలిసి కేజీ నెయ్యికి తన పీఏ చిన్నప్పన్న రూ.25 డిమాండ్‌ చేస్తున్నారని ఫిర్యాదు చేశారని సిట్ పేర్కొంది. మరోవైపు ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ సంస్థ నుంచి సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న ఢిల్లీలో వేర్వేరు సందర్భాల్లో మొత్తం రూ.50 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపింది.

శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన ఉదంతంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో దర్యాప్తు అధికారులు సుబ్బారెడ్డి, ఆయన అర్ధాంగి బ్యాంకు ఖాతాల వివరాలను కోరారు. దీనిని సవాల్‌ చేస్తూ వారిద్దరూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన సిట్, దర్యాప్తు తుది దశకు చేరుకోవడానికి బ్యాంకు ఖాతాల పరిశీలన అత్యంత కీలకమని, కాబట్టి వారి పిటిషన్‌ను కొట్టివేయాలని హైకోర్టును అభ్యర్థించింది.


More Telugu News