Eluru: ఏలూరు మెడికల్ కాలేజీ హాస్టల్‌లో కలకలం.. ఆరుగురు విద్యార్థులపై ఎలుక దాడి

Eluru Medical College Hostel Rats Bite Six Students
  • నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థులను కరిచిన ఎలుక
  • బాధితులకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ డోసులు
  • హాస్టల్‌లోకి చేరుతున్న ఎలుకలు, విషపురుగులు
  • నిర్మాణ పనుల కారణంగా పెరిగిన సమస్య
  • కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుకుంటున్న వైద్య విద్యార్థులకు ఊహించని సమస్య ఎదురైంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని మెడికల్ కాలేజీ హాస్టల్‌లో నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థులను ఎలుక కరిచింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థులు శనివారం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

కళాశాలకు సంబంధించిన నూతన భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడున్న పొదలు, చెట్లను తొలగించడంతో వాటిలో నివసించే ఎలుకలు, ఇతర విష కీటకాలు సమీపంలోని ఆసుపత్రి, హాస్టల్ భవనాల్లోకి వస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు ఎలుకలు దాడి చేస్తుండటంతో కంటి మీద కునుకు లేకుండా పోతోందని వారు వాపోతున్నారు.

గత కొంతకాలంగా ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ, సంబంధిత కాంట్రాక్టర్ పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కీటకాల నివారణపై దృష్టి సారించడం లేదని, అయినా ఆసుపత్రి అధికారులు మాత్రం ప్రతినెలా లక్షల రూపాయల బిల్లులను మంజూరు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్ వైద్యులకు కనీస రక్షణ కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, హాస్టల్‌లో తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Eluru
Eluru Medical College
Medical College Hostel
Rat bite
Andhra Pradesh
Anti-rabies vaccine
Hostel problems
Student health
Hospital
Pest control

More Telugu News