గుంటూరు నుంచి తిరుపతికి గుండె.. 12 ఏళ్ల బాలుడికి ప్రాణదానం

  • గుంటూరులో బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి గుండెను దానం చేసిన కుటుంబం
  • హృద‌య‌ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడికి గుండె మార్పిడి
  • గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్.. ప్రత్యేక విమానంలో గుండె తరలింపు
  • తిరుపతి శ్రీపద్మావతి హృదయాలయ ఆసుప‌త్రిలో శస్త్రచికిత్స
  • జీవన్‌ధాన్ పోర్టల్ ద్వారా సమన్వయం.. విజయవంతంగా చేరిన గుండె
ఒకవైపు తీరని దుఃఖం, మరోవైపు ప్రాణం కోసం పోరాటం.. ఈ రెండింటి మధ్య మానవత్వం గెలిచింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడికి శనివారం రాత్రి తిరుపతిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా ప్రారంభమైంది. గుంటూరులో బ్రెయిన్‌డెడ్‌కు గురైన 35 ఏళ్ల వ్యక్తి గుండెను ప్రత్యేక ఏర్పాట్ల మధ్య తిరుపతికి తరలించారు. దాత కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో ఉన్నప్పటికీ, ఒక చిన్నారికి ప్రాణం పోయాలన్న గొప్ప మనసుతో అవయవదానానికి ముందుకు రావడం అందరినీ కదిలించింది.

వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన అబ్రహం (35) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్యులు అబ్రహం కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానం ప్రాముఖ్యతను వివరించగా, వారు అంగీకరించారు. ఈ సమాచారాన్ని ఆస్పత్రి వర్గాలు వెంటనే జీవన్‌ధాన్‌కు తెలియజేశాయి.

మరోవైపు, కర్నూలు జిల్లా నందికోట్కూరుకు చెందిన 12 ఏళ్ల బాలుడు తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతూ, గత రెండు వారాలుగా తిరుపతిలోని శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడికి గుండె మార్పిడి ఒక్కటే మార్గమని వైద్యులు తేల్చి, అతని వివరాలను జీవన్‌ధాన్‌ పోర్టల్‌లో నమోదు చేశారు. అబ్రహం గుండె బాలుడికి సరిపోలడంతో, శ్రీపద్మావతి హృదయాలయ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తన బృందంతో హుటాహుటిన గుంటూరు బయల్దేరారు.

అక్కడ అబ్రహం శరీరం నుంచి గుండెను జాగ్రత్తగా సేకరించిన వైద్య బృందం, అక్కడి నుంచి ప్రయాణాన్ని ఓ యజ్ఞంలా పూర్తిచేసింది. గుంటూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి గ్రీన్ ఛానల్ ద్వారా అంబులెన్సులో తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం 7:50 గంటలకు బయల్దేరి, రాత్రి 9:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి శ్రీపద్మావతి ఆస్పత్రికి కేవలం 20 నిమిషాల్లో గ్రీన్ ఛానల్ ద్వారా రాత్రి 9:50 గంటలకు గుండెను తీసుకువచ్చారు. వెంటనే వైద్యులు ఆపరేషన్ థియేటర్‌లో బాలుడికి గుండె మార్పిడి శస్త్రచికిత్సను ప్రారంభించారు.


More Telugu News