GHMC: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాలు.... జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యాచరణ

GHMC Special Operation on Street Dogs as per Supreme Court Orders
  • హైదరాబాద్‌లో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు
  • తొలి రోజు ఆసుపత్రుల వద్ద 277 కుక్కల పట్టివేత
  • వాటిని స్టెరిలైజ్ చేసి జంతు సంరక్షణ కేంద్రాలకు తరలింపు
  • పాఠశాలలు, బస్టాండ్ల వద్ద కూడా డ్రైవ్ కొనసాగింపు
  • కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబ్బంది
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలతో వెటర్నరీ విభాగం సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డ్రైవ్‌లో భాగంగా తొలి రోజు నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వద్ద ఏకంగా 277 వీధి కుక్కలను పట్టుకున్నారు.
 
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పట్టుకున్న కుక్కలకు స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స) చేసి, జంతు సంరక్షణ కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. తొలి దశలో ఆసుపత్రులు, క్రీడా ప్రాంగణాలు, రవాణా కేంద్రాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
 
ప్రస్తుతం ఆసుపత్రుల ప్రాంగణాల్లో ఈ డ్రైవ్‌ను పూర్తి చేశామని, తదుపరి దశలో పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్‌లతో పాటు ఇతర పబ్లిక్ ప్రదేశాల్లోనూ కొనసాగిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నగరంలోని అన్ని జనసమ్మర్ద ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
GHMC
Street dogs
Supreme Court
Hyderabad
Dog control
Sterilization
RV Karnan
Animal shelters
Dog menace
Public safety

More Telugu News