Chandrababu Naidu: ఫేక్ ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Warns TDP Leaders Against YCP Fake Propaganda
  • ప్రతి ప్రజాప్రతినిధి వారానికోసారి 'ప్రజా వేదిక' నిర్వహించాలని స్పష్టీకరణ
  • కొత్తగా వచ్చిన వారి కన్నా పార్టీ సీనియర్లకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
  • పింఛన్లు, సంక్షేమ కార్యక్రమాల్లో నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశం
  • ప్రతి ఒక్కరి పనితీరుపై తన వద్ద సమాచారం ఉందన్న ముఖ్యమంత్రి
వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ కార్యాలయ విభాగాలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు.

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం, మొంథా తుపాను సహాయక చర్యలపై వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. పేదలకు మెరుగైన వైద్యం, విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, దానిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తుపాను సమయంలో ప్రభుత్వం బాధితులకు అండగా నిలిస్తే, జగన్ విషం చిమ్ముతున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా ప్రజా సేవలో నిబద్ధతతో వ్యవహరించాలని నేతలకు హితవు పలికారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వారంలో ఒక రోజు కచ్చితంగా 'ప్రజా వేదిక' కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించాలని ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో పరిష్కరించే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని గుర్తుచేశారు. ఇటీవల ఎమ్మెల్యేలు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

కొందరు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్లను పక్కనపెట్టి, వైసీపీ నుంచి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని చంద్రబాబు హెచ్చరించారు. ఇది సరైన పద్ధతి కాదని, పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారిని కలుపుకొనిపోవాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి పనితీరుపై తన వద్ద పూర్తి సమాచారం ఉందని, ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నానని తెలిపారు.

'పేదల సేవలో' కార్యక్రమంతో పాటు పింఛన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత వంటి సంక్షేమ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుని పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టులు, ట్రస్ట్ బోర్డు కమిటీలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు.
Chandrababu Naidu
TDP
YCP
Andhra Pradesh Politics
Fake News
Political Campaign
Medical Colleges
Cyclone Montha
Public Grievances
Welfare Schemes

More Telugu News