Vidadala Rajini: అక్రమ కేసులు పెడుతున్న వారిని వదిలిపెట్టను.. పోలీసులను హెచ్చరించిన రజిని

YSRCP Leader Rajini Accuses Police of Targeting Her
  • తనపై టీడీపీ, పోలీసులు కుట్ర పన్నారన్న విడదల రజని
  • టీడీపీ వ్యక్తిని తన అనుచరుడిగా చిత్రీకరించి కేసు పెట్టారని ఆరోపణ
  • డీఎస్పీపై పరువు నష్టం దావా వేస్తానని వెల్లడి
    చిలకలూరిపేట నుంచే మళ్లీ పోటీ చేస్తానని స్పష్టీకరణ
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని... చిలకలూరిపేట టీడీపీ నేతలు, స్థానిక పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కట్టుకథలు అల్లి, తన సిబ్బందిపై అక్రమంగా చీటింగ్ కేసు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు.

శ్రీ గణేశ్ చౌదరి అనే వ్యక్తి తమ అనుచరుడంటూ పోలీసులు కేసు నమోదు చేశారని, కానీ అతను టీడీపీ మద్దతుదారుడని రజని స్పష్టం చేశారు. దర్శి టీడీపీ అభ్యర్థి తరఫున శ్రీ గణేశ్ ప్రచారం చేస్తున్న ఫోటోలను ఆమె మీడియాకు చూపించారు. అంతేకాకుండా, 10 సంవత్సరాల క్రితం పత్తిపాటి పుల్లారావు అనుచరుడినని చెప్పి శ్రీ గణేశ్ ఉద్యోగాల పేరుతో మోసం చేశాడని బాధితులు లోకేశ్ కు ఇచ్చిన ఫిర్యాదు పత్రాలను కూడా ఆమె ప్రస్తావించారు. ఈ పత్రాల్లో ఎక్కడా తమ పేరు లేకపోయినా, ఇప్పుడు కావాలనే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.

ఈ కేసులో పోలీసుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓ డీఎస్పీ పచ్చ చొక్కా వేసుకుని పనిచేస్తున్నారని, కనీస విచారణ లేకుండానే తమపై కేసులు బనాయించారని మండిపడ్డారు. నియోజకవర్గంలో రేషన్, గ్రావెల్ మాఫియా, పేకాట వంటి అక్రమాలను వదిలేసి, కేవలం వైసీపీ శ్రేణులనే లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు.

ఈ అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తానని రజని హెచ్చరించారు. సంబంధిత డీఎస్పీపై పరువు నష్టం దావా వేస్తానని, మానవ హక్కుల కమిషన్‌ను, జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. తప్పుడు కేసులు పెడుతున్న అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి చర్యలన్నీ రికార్డ్ అవుతున్నాయని అన్నారు.

ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ఇప్పటికే తనపై 7 కేసులు ఉన్నా ధైర్యంగా నిలబడ్డానని గుర్తుచేశారు. జగన్ ఆశీస్సులతో చిలకలూరిపేట నుంచే మళ్లీ పోటీ చేసి గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మహిళా రాజకీయ నాయకురాలిగా తన ఎదుగుదలను ఓర్వలేకే ఈ దాడులు చేస్తున్నారని విడదల రజని పేర్కొన్నారు.
Vidadala Rajini
YSRCP
Chilakaluripet
TDP
Illegal Cases
Andhra Pradesh Politics
Police Allegations
Political Conspiracy
Sri Ganesh Chowdary
Human Rights Commission

More Telugu News