Panchumarthi Anuradha: ఈ రోజు రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు: పంచుమర్తి అనురాధ

Panchumarthi Anuradha Kuppam to be Gateway for Apple iPhone Manufacturing
  • ఐఫోన్ విడిభాగాల తయారీకి కీలక కేంద్రంగా కుప్పం
  • రూ.586 కోట్ల పెట్టుబడితో హిందాల్కో పరిశ్రమ ఏర్పాటు
  • చంద్రబాబు, లోకేశ్ కృషితోనే ఇది సాధ్యమైందన్న అనురాధ
  • జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శ
  • దొంగ మెయిల్స్‌తో జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపణ
  • ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు
ప్రపంచ ప్రఖ్యాత యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల తయారీలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుందని, అందుకు కుప్పం నియోజకవర్గం గేట్‌వేగా మారిందని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ల కృషితో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు తరలివస్తున్నాయని ఆమె కొనియాడారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఈ రోజు రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని అనురాధ అభివర్ణించారు. అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ చాసిస్‌కు అవసరమైన హై-గ్రేడ్ అల్యూమినియం ఇకపై కుప్పం నుంచే సరఫరా అవుతుందని ఆమె ప్రకటించారు. ఇందుకోసం ప్రముఖ పారిశ్రామిక సంస్థ హిందాల్కో రూ.586 కోట్ల పెట్టుబడితో కుప్పంలో పరిశ్రమను ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. ఈ పరిశ్రమ ద్వారా 613 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించడంతో పాటు, లాజిస్టిక్స్, సేవలు, నైపుణ్యాభివృద్ధి వంటి అనుబంధ రంగాల్లో వేలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్ యాపిల్ గ్లోబల్ సప్లై చైన్‌లో భాగమైందని, దానికి కుప్పం ప్రవేశ ద్వారంగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్ గత 16 నెలలుగా దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ వంటి అనేక దేశాల్లో పర్యటించి పెట్టుబడులను ఆకర్షించారని గుర్తుచేశారు. ఆయన అవిశ్రాంత కృషితో ఇప్పటివరకు రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించగలిగారని చెప్పారు.

జగన్ పై తీవ్ర విమర్శలు

జగన్ పాలనలో రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైందని అనురాధ తీవ్రంగా విమర్శించారు. రూ.11 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేశారని, కనీసం రాజధాని కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. నకిలీ మద్యం, అక్రమ మైనింగ్, గంజాయి, కిడ్నాప్‌లు, అత్యాచారాలతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టారని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే, జగన్ రెడ్డి దొంగ మెయిల్స్ పంపుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. తన సొంత పరిశ్రమలైన నకిలీ మద్యం, అక్రమ మైనింగ్ దందాలు మూతపడతాయనే భయంతోనే జగన్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్ హయాంలో పీపీఏలు రద్దు చేయడం వల్ల ప్రజల సొమ్ము రూ.10,000 కోట్లు జరిమానాగా కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. 

వైసీపీ నేతలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా, కుట్రలు పన్నినా రాష్ట్రాభివృద్ధిని ఆపలేరన్నారు. రాష్ట్రాన్ని కాపాడేది, జగన్ కుట్రలకు ఫుల్‌స్టాప్ పెట్టేది చంద్రబాబు నాయుడేనని ఆమె స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గానికి హిందాల్కో పరిశ్రమను తీసుకొచ్చిన మంత్రి నారా లోకేశ్ కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Panchumarthi Anuradha
Andhra Pradesh
Apple iPhone
Kuppam
Nara Lokesh
Chandrababu Naidu
Hindalco
Investments AP
AP Industries
Job Creation

More Telugu News