Amayra: స్కూల్‌లో దారుణం.. వేధింపులు తాళలేక 9 ఏళ్ల బాలిక ఆత్మహత్య!

Amayra 9 year old girl commits suicide due to harassment in Jaipur school
  • జైపూర్‌లోని నీర్జా మోదీ స్కూల్‌లో తీవ్ర విషాదం
  • నాలుగో అంతస్తు నుంచి దూకి 9 ఏళ్ల బాలిక ఆత్మహత్య
  • తోటి విద్యార్థుల నుంచి వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ
  • ఏడాదిగా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోని యాజమాన్యం
  • ఆత్మహత్యకు ముందు టీచర్‌తో మాట్లాడిన బాలిక
  • సీసీటీవీలో ఆడియో మాయం
జైపూర్‌లోని ఓ ప్రతిష్ఠాత్మక పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తోటి విద్యార్థుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన బుల్లీయింగ్, లైంగిక పరమైన వేధింపులు తాళలేక 9 ఏళ్ల బాలిక పాఠశాల భవనంలోని నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. జైపూర్‌లోని నీర్జా మోదీ స్కూల్‌లో నవంబర్ 1న ఈ దారుణ ఘటన జరిగింది. తమ కుమార్తె ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏడాదిగా స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తున్నా వారు పట్టించుకోలేదని చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

నాలుగో తరగతి చదువుతున్న అమాయ్రా అనే చిన్నారి కొంతకాలంగా స్కూల్‌కు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఏడాది క్రితం ఆమె తల్లి శివాని మీనా "అమ్మా నేను స్కూల్‌కు వెళ్లను.. నన్ను పంపొద్దు" అని తన కుమార్తె ఏడుస్తున్న ఆడియోను వాట్సాప్‌లో రికార్డ్ చేసి క్లాస్ టీచర్‌కు పంపారు. సమస్యను అర్థం చేసుకుని పరిష్కరిస్తారని భావించినా, స్కూల్ సిబ్బంది తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని, దాటవేసేవారని ఆమె ఆరోపించారు.

చిన్నారి తండ్రి విజయ్ మీనా మాట్లాడుతూ ఓ పేరెంట్-టీచర్ మీటింగ్‌లో కొందరు విద్యార్థులు తన కుమార్తెను, మరో అబ్బాయిని చూపిస్తూ సైగలు చేశారని, దీంతో అమాయ్రా భయపడి తన వెనుక దాక్కుందని గుర్తుచేసుకున్నారు. ఈ విషయాన్ని టీచర్ దృష్టికి తీసుకెళ్లగా "ఇది కో-ఎడ్ స్కూల్, అబ్బాయిలతో కూడా మాట్లాడటం నేర్చుకోవాలి" అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "అబ్బాయిలతో మాట్లాడాలా? వద్దా? అనేది నా కుమార్తె ఇష్టం" అని తాను స్పష్టం చేసినట్లు తెలిపారు.

ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని నిమిషాల ముందు అమాయ్రా రెండుసార్లు తన క్లాస్ టీచర్ వద్దకు వెళ్లి మాట్లాడినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైంది. అయితే, సీబీఎస్ఈ నిబంధనల ప్రకారం క్లాస్‌రూమ్ సీసీటీవీల్లో ఆడియో రికార్డింగ్ తప్పనిసరి అయినా, ఈ ఫుటేజ్‌కు ఎలాంటి సౌండ్ లేదు. దీంతో ఆమె టీచర్‌తో ఏం మాట్లాడిందనేది తెలియరాలేదు.

"ఆరంతస్తుల భవనానికి కనీస భద్రతగా గ్రిల్స్ లేదా నెట్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? సీసీటీవీ ఫుటేజ్‌లో ఆడియో ఎందుకు లేదు? వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యానికి జవాబుదారీతనం లేదా?" అని అమాయ్రా బంధువు సాహిల్ ప్రశ్నించారు.

ఈ ఘటనపై జైపూర్ డీసీపీ రాజర్షి రాజ్ వర్మ స్పందిస్తూ, తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం తీసుకున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి రామ్‌నివాస్ శర్మ కూడా పోలీసుల సమక్షంలో తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని చెప్పారు. కొందరు విద్యార్థులు అమర్యాదకరమైన పదజాలం వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై స్కూల్ యాజమాన్యం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన విచారణ కొనసాగుతోంది.
Amayra
Jaipur school suicide
Neerja Modi School
bullying
student harassment
school negligence
child suicide
Rajasthan news
CBSE guidelines
school safety

More Telugu News