Pawan Kalyan: పల్లె రహదారుల సమాచారం అరచేతిలో.. పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

Pawan Kalyan Announces Geo Rural Road Management System for Villages
  • పల్లె రహదారుల సమాచారం కోసం 'జియో రూరల్ రోడ్ మేనేజ్‌మెంట్ సిస్టం'
  • పైలట్ ప్రాజెక్టుగా 'అడవి తల్లి బాట'కు అనుసంధానం
  • సాస్కీ నిధులతో పల్లె పండగ 2.0 ప్రారంభించాలని ఆదేశం
  • నవంబర్ మూడో వారం నుంచి జల్ జీవన్ మిషన్ పనుల క్షేత్రస్థాయి పరిశీలన
గ్రామీణ ప్రాంతాల్లోని రహదారుల పూర్తి సమాచారాన్ని ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు 'జియో రూరల్ రోడ్ మేనేజ్‌మెంట్ సిస్టం' పేరిట ఓ సరికొత్త సాంకేతిక వ్యవస్థను తీసుకురానున్నట్లు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, గుంతలు లేని రోడ్లు అందించడమే తన ప్రథమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "మనం ప్రయాణం చేసే మార్గంలో రోడ్డు ఉందా, లేదా? ఉంటే దాని పరిస్థితి ఏంటి? అనే వివరాలు ప్రజల చేతిలో ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రహదారుల పూర్తి వివరాలు ప్రతి ఒక్కరికీ తెలిసేలా ఈ వ్యవస్థను రూపొందించాలి" అని అధికారులను ఆదేశించారు. ఈ టెక్నాలజీ రూపకల్పనపై 48 గంటల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, పైలట్ ప్రాజెక్టుగా 'అడవి తల్లి బాట'ను ఈ సిస్టంకు అనుసంధానించాలని సూచించారు.

పనుల పురోగతిపై అసంతృప్తి

అడవి తల్లి బాట, జల్ జీవన్ మిషన్ వంటి కీలక పథకాల పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంపై పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు అందుబాటులో ఉన్నా పనులు నెమ్మదిగా సాగడంపై అధికారులను ప్రశ్నించారు. గిరిజన గ్రామాలను కలిపే 'అడవి తల్లి బాట' కోసం రూ.1,158 కోట్లు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేస్తూ, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అటవీ శాఖ అనుమతులు వంటి సమస్యలుంటే వెంటనే పరిష్కరించుకోవాలని, అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని నిర్దేశించారు.

పల్లె పండగ 2.0, జల్ జీవన్ మిషన్

సాస్కీ నిధులు రూ.2,123 కోట్లతో 'పల్లె పండగ 2.0' కార్యక్రమాన్ని వెంటనే పట్టాలెక్కించాలని పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. నిధుల విడుదల కోసం ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. అలాగే, జల్ జీవన్ మిషన్ ద్వారా అందిస్తున్న తాగునీటి నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. నవంబర్ మూడో వారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టుల పురోగతిని, నీటి నాణ్యతను స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు.

మార్చి నాటికి కోటి స్వమిత్వ కార్డులు

గ్రామీణ ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పించే 'స్వమిత్వ' పథకాన్ని వేగవంతం చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి ప్రాపర్టీ కార్డులు అందజేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో రీ-సర్వే పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని, తమ ప్రభుత్వంలో అలాంటి పొరపాట్లకు తావుండదని భరోసా ఇచ్చారు. లబ్ధిదారులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన కార్డులు అందిస్తామని, వాటి ద్వారా వారు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ఉన్నతాధికారులు శశిభూషణ్ కుమార్, కృష్ణ తేజ, కూర్మనాథ్ తదితరులు పాల్గొన్నారు. 
Pawan Kalyan
Pawan Kalyan rural roads
Andhra Pradesh roads
Jio Rural Road Management System
Jal Jeevan Mission
Palle Pandaga 2.0
Swamitva scheme
Rural development
AP Panchayat Raj
Adavi Talli Bata

More Telugu News