Revanth Reddy: అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్నారు.. బకాయిలు ఈరోజు కాకుంటే రేపు వస్తాయి: కాలేజీలపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

Revanth Reddy Angered by Colleges Increasing Fees Arbitrarily
  • మా హయాంలో బకాయిలు ముందుగా చెల్లిస్తామని వెల్లడి
  • విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని విజ్ఞప్తి
  • కాలేజీలు బంద్ పెడితే విద్యార్థులు కోల్పోయిన సమయం తిరిగి వస్తుందా అని నిలదీత
  • వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని ఎలా నడపాలని ప్రశ్న
ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యాసంస్థలు చేపట్టిన బంద్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అడ్డగోలుగా ఫీజులు పెంచుకుని వచ్చి రీయింబర్సుమెంట్ అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. తమ హయాంలోని బకాయిలు ముందుగా చెల్లిస్తామని, విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆటలు ఆడవద్దని విజ్ఞప్తి చేశారు.

బకాయిలు ఈరోజు కాకుంటే రేపు వస్తాయని, కానీ కాలేజీలు బంద్ పెడితే విద్యార్థులు కోల్పోయిన సమయం తిరిగి వస్తుందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులకు ఇబ్బంది లేదని అన్నారు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని అన్నారు. రాష్ట్రానికి నెలకు రూ. 18 వేల కోట్ల ఆదాయం వస్తోందని, వేతనాలు, వడ్డీలు, ఇతర ఖర్చులు పోను మిగిలేది రూ. 5 వేల కోట్లే అన్నారు.

ఈ ఆదాయంతో రాష్ట్రాన్ని ఎలా నడపాలో చెప్పండని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలను బంద్ చేయించిన వారితో చర్చించడానికి ఏముంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ఏ కాలేజీ ఎంత డొనేషన్ వసూలు చేస్తుందో తనకు తెలుసని అన్నారు. కాలేజీలు నిబంధనలు పాటించాలని అన్నారు. ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు.

విద్య వ్యాపారం కాదని, సేవగా భావించాలని సూచించారు. రాజకీయ నేతలు అండగా ఉన్నారని విద్యార్థులతో ఆడుకోవద్దని హెచ్చరించారు. కాలేజీలకు అనుమతుల విషయంలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. కాలేజీల యజమానులు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తారా? అని నిలదీశారు. ఆర్. కృష్ణయ్య కూడా వారి ఉచ్చులో పడ్డారని విమర్శించారు. ఆర్. కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ ముందుకొస్తే వారి చేతికే చిట్టా ఇస్తానని అన్నారు.
Revanth Reddy
Telangana
Fee Reimbursement
Higher Education Institutes
College Fees

More Telugu News