మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు... మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు

  • రూ.1,01,899 కోట్ల విలువైన 26 పరిశ్రమలకు రాష్ట్ర పెట్టుబడుల బోర్డు ఆమోదం
  • ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 85,570 మందికి ఉపాధి అవకాశాలు
  • గత 16 నెలల్లో మొత్తం రూ. 8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్న ప్రభుత్వం
  • ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశం
  • విశాఖ, అమరావతి, తిరుపతిలను మెగా సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం
  • ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో భారీ పెట్టుబడుల సదస్సు నిర్వహణకు సన్నాహాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం, రూ. 1,01,899 కోట్ల విలువైన 26 పారిశ్రామిక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ఈ భారీ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 85,570 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 

అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. “రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చేలా చూడటం అధికారుల బాధ్యత. పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని సమయం వృధా కాకుండా తక్షణం ఆమోదం తెలియచేయాలి. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన పరిశ్రమలు, ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా (గ్రౌండ్ అయ్యేలా) చూసే బాధ్యతను అధికారులు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టే పరిశ్రమల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలి” అని ఆయన ఆదేశించారు.

గత ప్రభుత్వ హయాంలో భూములు కేటాయించినా ఇప్పటికీ ప్రారంభం కాని ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించాలని, నిర్మాణంలో పురోగతి లేకపోతే వాటి అనుమతులు రద్దు చేయాలని సీఎం తేల్చిచెప్పారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, చిప్, సెమీ కండక్టర్లు, డ్రోన్ల తయారీ వంటి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. 

రాష్ట్రంలో 15 పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేసి, క్లస్టర్ల వారీ విధానంతో పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించి, పెట్టుబడులు చేజారకుండా చూడాలన్నారు. “కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాలు ఆలస్యమైనా, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాల్సినవి వెంటనే అందించి పరిశ్రమలను నిలబెట్టాలి” అని సీఎం స్పష్టం చేశారు. పారిశ్రామిక అవసరాల కోసం ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధంగా ఉంచాలని, ప్రైవేటు భూ యజమానులు పరిశ్రమలకు భూములిచ్చేందుకు ముందుకొస్తే వారిని ప్రోత్సహించాలని తెలిపారు.

మూడు మెగా సిటీలు... మాస్టర్ ప్లాన్లు

రాష్ట్రంలో మూడు మెగా సిటీలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని సీఎం పునరుద్ఘాటించారు. “అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విశాఖను, అలాగే అమరావతి, తిరుపతి నగరాలను మెగా సిటీలుగా అభివృద్ధి చేయాలి. అమరావతికి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఉంది. విశాఖ, తిరుపతిలకు కూడా వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఈ నగరాలను టూరిజం, ఐటీ సహా వివిధ పరిశ్రమలకు కేంద్రాలుగా తీర్చిదిద్దాలి” అని సీఎం అన్నారు. మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ, పర్యాటక శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ నగరాలను నివాసయోగ్యంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సూచించారు. 

గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖకు మరిన్ని కంపెనీలు రానున్నాయని, వాటికి అవసరమైన భూ లభ్యత ఉండేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో మూడు ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు కానున్న నేపథ్యంలో, వాటి అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తామని ప్రకటించారు.

పెట్టుబడుల సదస్సును ఘనంగా నిర్వహించాలి

ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎస్ఐపీబీ ఆమోదించిన పరిశ్రమలకు వెంటనే శంకుస్థాపనలు చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సహా ఇతర మంత్రులు వివిధ జిల్లాల్లో ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపారు. తాను ఇటీవల జరిపిన విదేశీ పర్యటనల్లో పలువురు పారిశ్రామికవేత్తలను సదస్సుకు ఆహ్వానించానని, వారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు, సదస్సుకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారని వివరించారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, నారాయణ, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


More Telugu News