Karnataka: 8 నెలల క్రితం ఏనుగు దాడి నుంచి తప్పించుకున్నాడు.. ఇప్పుడు పులికి చిక్కాడు!

Farmer killed in tiger attack in Karnatakas Mysuru
  • కర్ణాటక మైసూరు జిల్లాలో పులి దాడిలో రైతు మృతి
  • పొలానికి వెళుతుండగా దాడి.. మృతదేహంలోని కొన్ని భాగాలను తిన్న పులి
  • ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో ఇది మూడో మరణం
  • 8 నెలల క్రితం ఏనుగు దాడి నుంచి తప్పించుకున్న బాధితుడు
  • అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రంగా ఆగ్రహిస్తున్న స్థానికులు
కర్ణాటకలోని మైసూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో పులి దాడి చేయడంతో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో స్థానిక గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అస‌లేం జ‌రిగిందంటే..!
మైసూరు జిల్లా సరగూరు తాలూకాలోని హళేహెగ్గోడిలు గ్రామానికి చెందిన దండా నాయక అలియాస్ స్వామి (58) అనే రైతు పొలానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. నూగు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో పులి అతడిపై దాడి చేసి చంపేసింది. అనంతరం మృతుడి తల, తొడ భాగాలను తినేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కాగా, మృతుడు సుమారు 8 నెలల క్రితం ఏనుగు దాడి నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడటం గమనార్హం. ఇప్పుడు పులి దాడిలో మరణించడంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ ప్రాంతంలో పులుల దాడుల్లో రైతులు మరణించడం గత కొన్ని నెలల్లో ఇది మూడోసారి కావడంతో స్థానికుల్లో ఆందోళన పెరిగిపోయింది. అక్టోబర్ 26న సరగూరు తాలూకాలోని ముల్లూరు గ్రామ సమీపంలో రాజశేఖర (54) అనే రైతు పశువులను మేపుతుండగా పులి దాడిలో మరణించాడు. ఆ ఘటన జరిగినప్పుడు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేను గ్రామస్థులు అడ్డుకుని నిరసన తెలిపారు. పులి కదలికలను గుర్తించినా, అధికారులు బోను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని వారు ఆరోపించారు.

వరుస ఘటనలపై ప్రభుత్వం స్పందించకపోవడంపై రైతు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని, అవసరమైతే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తన సొంత జిల్లా మైసూరుతో పాటు పక్కనే ఉన్న చామరాజనగర్ జిల్లాల్లో పులుల దాడులు పెరగడంపై త్వరలోనే మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. అటవీ ప్రాంతాల్లోని అక్రమ రిసార్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Karnataka
Mysore
tiger attack
farmer killed
Danda Nayaka
wildlife
forest department
Saraguru
elephant attack
Siddaramaiah

More Telugu News