ముంబైలో రైల్వే ఉద్యోగుల ఆందోళన.. రైలు నుంచి దిగిన ప్రయాణికులను ఢీకొట్టిన రైలు.. ఇద్దరి మృతి

  • ముంబైలో రైల్వే ఉద్యోగుల ఆకస్మిక నిరసన
  • గంటపాటు నిలిచిపోయిన సెంట్రల్ రైల్వే సేవలు
  • పట్టాలపై నడుస్తుండగా రైలు ఢీకొని ఇద్దరు ప్రయాణికుల మృతి
  • ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
  • ఇంజనీర్లపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ను నిరసిస్తూ ఉద్యోగుల ఆందోళన
ముంబై సెంట్రల్ రైల్వేలో గురువారం సాయంత్రం తీవ్ర గందరగోళం నెలకొంది. రైల్వే ఉద్యోగులు చేపట్టిన ఆకస్మిక నిరసన పెను విషాదానికి దారితీసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ) వద్ద ఉద్యోగులు చేపట్టిన ధర్నాతో రద్దీ సమయంలో సుమారు గంటపాటు సబర్బన్ రైలు సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో రైళ్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులు కిందకు దిగి పట్టాల వెంబడి నడవడం ప్రారంభించారు. ఈ క్రమంలో శాండ్‌హర్స్ట్ రోడ్ స్టేషన్ సమీపంలో వేగంగా వస్తున్న లోకల్ రైలు ఢీకొని ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతులను 19 ఏళ్ల హేలీ మొమయా, మరో గుర్తుతెలియని వ్యక్తిగా గుర్తించారు. గాయపడిన వారిలో యాఫిసా చోగ్లే (62), ఖుష్బూ మొమయా (45), కైఫ్ చోగ్లే (22) ఉన్నారు. వీరిని జేజే ఆసుపత్రికి తరలించారు. ఆగిపోయిన లోకల్ నుంచి దిగి పట్టాలపై నడుస్తుండగా సాయంత్రం 6:50 గంటల సమయంలో వేగంగా వస్తున్న లోకల్ వీరిని ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు.

నిరసనకు కారణం ఇదే
జూన్ 9న ముంబ్రా వద్ద జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించి ఇద్దరు సెంట్రల్ రైల్వే ఇంజనీర్లపై గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడమే ఈ ఆందోళనకు కారణం. దీనిని వ్యతిరేకిస్తూ సెంట్రల్ రైల్వే మజ్దూర్ సంఘ్ (సీఆర్ఎంఎస్) ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసనకు దిగారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమైన ఈ ఆందోళన, 5:30 గంటలకల్లా తీవ్రరూపం దాల్చింది. మోటార్‌మెన్ లాబీ ముందు ఉద్యోగులు బైఠాయించడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

సీనియర్ అధికారుల జోక్యంతో సాయంత్రం 6:45 గంటలకు ఉద్యోగులు ఆందోళన విరమించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ హిరేష్ మీనా, ఇతర అధికారులు ఆందోళనకారులతో చర్చించి, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను వివరించడంతో వారు శాంతించినట్లు సీఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నీలా తెలిపారు. 


More Telugu News