Joint Base Andrews: అమెరికా సైనిక స్థావరంలో కలకలం.. అనుమానాస్పద ప్యాకేజీతో సైనికులకు అస్వస్థత

Suspicious Package at US Joint Base Andrews Causes Alarm
  • వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో అనుమానాస్పద ప్యాకేజీ
  • ప్యాకేజీలో తెల్లటి పౌడర్ ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది
  • పార్శిల్ తెరిచిన తర్వాత అనారోగ్యం పాలైన పలువురు
  • ముందుజాగ్రత్త చర్యగా రెండు భవనాలను ఖాళీ చేయించిన అధికారులు
అమెరికాలోని అత్యంత కీలకమైన సైనిక స్థావరంలో తీవ్ర కలకలం రేగింది. వాషింగ్టన్ వెలుపల ఉన్న జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు వచ్చిన ఒక అనుమానాస్పద ప్యాకేజీ కారణంగా పలువురు సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్యాకేజీలో గుర్తుతెలియని తెల్లటి పౌడర్ ఉన్నట్లు సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

సీఎన్ఎన్ కథనం ప్రకారం స్థావరంలోని ఒక భవనంలో ఓ వ్యక్తి ఈ ప్యాకేజీని తెరిచిన వెంటనే అందులో ఉన్నవారు అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో అధికారులు తక్షణమే స్పందించి ఆ భవనంతో పాటు దానికి అనుసంధానంగా ఉన్న మరో భవనాన్ని కూడా ఖాళీ చేయించారు. "ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతం చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశాం" అని జాయింట్ బేస్ ఆండ్రూస్ ఒక ప్రకటనలో తెలిపినట్లు సీఎన్ఎన్ వివరించింది. ప్యాకేజీని తెరిచిన భవనంలోనే ఎయిర్ నేషనల్ గార్డ్ రెడీనెస్ సెంటర్ కూడా ఉండటం గమనార్హం.

మేరీల్యాండ్‌లో ఉన్న ఈ జాయింట్ బేస్ ఆండ్రూస్‌ను అమెరికా అధ్యక్షులు తమ అధికారిక పర్యటనల కోసం విమానాలు ఎక్కడానికి తరచూ ఉపయోగిస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యమున్న స్థావరంలో ఈ ఘటన జరగడంతో భద్రతా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. అస్వస్థతకు గురైన వారిని స్థావరంలోనే ఉన్న మాల్కమ్ గ్రోవ్ మెడికల్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
Joint Base Andrews
Andrews Air Force Base
US military base
suspicious package
Washington DC
Malcolm Grow Medical Center
Air National Guard Readiness Center
Maryland
US security

More Telugu News