Kyvalya Reddy: అంతరిక్షంలోకి ఏపీ అమ్మాయి.. వ్యోమగామి శిక్షణకు ఎంపికైన నిడదవోలు యువతి

AP Teen Kyvalya Reddy Selected For Global Astronaut Training Programme
  • అమెరికా వ్యోమగామి శిక్షణకు ఎంపికైన ఏపీ అమ్మాయి
  • తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కైవల్య రెడ్డి
  • ఫ్లోరిడాలో నాలుగేళ్ల పాటు కొనసాగనున్న శిక్షణ
  • ప్రపంచవ్యాప్తంగా వేల మంది నుంచి 150 మంది ఎంపిక
  • నాసా మాజీ వ్యోమగాముల ఆధ్వర్యంలో ట్రైనింగ్
  • 2029లో అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న కైవల్య
ఏపీకి చెందిన ఓ యువతి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతరిక్షంలోకి అడుగుపెట్టే తన కలను సాకారం చేసుకునే దిశగా కీలక మైలురాయిని దాటింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచల కైవల్య రెడ్డి, అమెరికాలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక వ్యోమగామి శిక్షణకు ఎంపికైంది. ఫ్లోరిడాలోని 'టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్' ఆధ్వర్యంలో జరిగే ఈ శిక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల నుంచి వేలాది మంది పోటీ పడగా, కేవలం 150 మంది మాత్రమే అర్హత సాధించారు. వారిలో కైవల్య రెడ్డి ఒకరిగా నిలవడం విశేషం.

ఈ శిక్షణ నాలుగేళ్ల పాటు కొనసాగనుంది. దీనిని విజయవంతంగా పూర్తి చేసిన వారు 2029లో అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. ఈ యాత్రలో భాగంగా వ్యోమగాములు భూమి నుంచి 300 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో పరిభ్రమించనున్నారు. మొత్తం 5 గంటల పాటు సాగే ఈ మిషన్‌లో సుమారు 3 గంటల పాటు జీరో గ్రావిటీలో గడుపుతారు. కైవల్యకు నాసా మాజీ వ్యోమగామి, 224 రోజులు అంతరిక్షంలో గడిపిన విలియం మెక్‌ఆర్థర్, బ్రెజిల్ తొలి వ్యోమగామి మార్కోస్ పోంటెస్ వంటి ప్రముఖ నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు.

కైవల్య రెడ్డి తండ్రి కుంచాల శ్రీనివాసరెడ్డి, నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె తల్లి విజయలక్ష్మి గృహిణి. తనకు చిన్నప్పటి నుంచే అంతరిక్షం, ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉండేదని కైవల్య తెలిపింది. భవిష్యత్తులో జర్మనీలో ఆస్ట్రోఫిజిక్స్ చదివి ఖగోళ శాస్త్రవేత్త కావాలన్నదే తన లక్ష్యమని పేర్కొంది.

17 ఏళ్లకే ఈ ఘనత సాధించిన కైవల్య, గతంలోనూ తన ప్రతిభను చాటుకుంది. 2023లో నాసా ఆధ్వర్యంలో జరిగిన 'అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం' (IASP)కు కూడా ఎంపికైంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆమె అమెరికాలోని అలబామాలో 15 రోజుల పాటు శిక్షణ పొందింది. సైన్స్ పట్ల ఆమెకున్న ఆసక్తి, పట్టుదలే ఈ అరుదైన అవకాశాలను అందిస్తున్నాయని పలువురు అభినందిస్తున్నారు.
Kyvalya Reddy
Kaivalya Reddy
space training
Titans Space Industries
Nidadavolu
Andhra Pradesh
astronaut training
space mission
William McArthur
Marcos Pontes

More Telugu News