క్లైమాక్స్ షూటింగ్‌లో ఉన్నాం.. మహేశ్ సినిమాపై రాజమౌళి క్రేజీ అప్‌డేట్

  • మహేశ్ బాబు సినిమాపై అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి
  • ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోందని వెల్లడి
  • నవంబర్ 15న 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో భారీ ఈవెంట్
  • ఈరోజు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదల
  • సోషల్ మీడియాలో మహేశ్, ప్రియాంకలతో జక్కన్న సరదా సంభాషణ
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రానున్న భారీ చిత్రంపై కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోందని రాజమౌళి స్వయంగా వెల్లడించారు. అలాగే ఈ నెల‌ 15న 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఈ మేరకు రాజమౌళి తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. "ప్రస్తుతం ముగ్గురు ప్రధాన నటులతో క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. దీంతో పాటు 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ కోసం కూడా భారీగా సన్నాహాలు చేస్తున్నాం. గతంలో మేము చేసిన దానికంటే ఇది చాలా భిన్నంగా, కొత్తగా ఉండబోతోంది. ఈ నెల‌ 15న మీ అంద‌రికీ ఇది క‌చ్చితంగా గొప్ప అనుభూతిని పంచుతుంది" అని రాజమౌళి పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌కు ముందుగా ఈ రోజు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా అప్‌డేట్ కోసం మహేశ్ బాబు, రాజమౌళి మధ్య సోషల్ మీడియాలో ఓ సరదా సంభాషణ జరిగింది. ఈ నెల‌ 1న మహేశ్ 'నవంబర్ వచ్చేసింది రాజమౌళి గారు' అని ట్వీట్ చేయగా, దానికి జక్కన్న 'అవును.. ఈ నెలలో ఏ సినిమాకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావు?' అంటూ సరదాగా బదులిచ్చారు. దీనికి మహేశ్ స్పందిస్తూ.. 'మీరు ఎప్పటికీ తీస్తూనే ఉండే మహాభారతం గురించి సార్.. ముందుగా నవంబర్‌లో ఏదో ఇస్తానని మాటిచ్చారు, ఆ మాట నిలబెట్టుకోండి' అన్నారు.

ఈ సంభాషణలో హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా పాలుపంచుకున్నారు. హైదరాబాద్ వీధుల గురించి ప్రియాంక జనవరి నుంచి ఇన్‌స్టాలో పోస్టులు పెడుతోందని మహేశ్ ఆటపట్టించగా, ప్రియాంక స్పందిస్తూ 'హలో హీరో!!! సెట్‌లో నాతో పంచుకునే కథలన్నీ లీక్ చేయమంటావా? మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వేసేస్తా' అంటూ తనదైన శైలిలో బదులిచ్చారు. ప్రియాంక చోప్రా విషయాన్ని బయటపెట్టావంటూ మహేశ్‌ను ఉద్దేశించి "సర్‍ప్రైజ్‌ను పాడుచేశావ్" అని రాజమౌళి సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సరదా సంభాషణ, రాజమౌళి తాజా ప్రకటనలతో సినిమాపై ఉన్న భారీ అంచనాలు మరింతగా పెరిగాయి.


More Telugu News