WPL 2026: హర్మన్‌ప్రీత్ కంటే నాట్ స్కివర్‌కే ఎక్కువ ధర.. ముంబై రిటెన్షన్ వెనుక అసలు కథ ఇదే!

Harmanpreet Kaurs Big Sacrifice For WPL 2026 Sees England Star Nat Sciver Brunt
  • డ‌బ్ల్యూపీఎల్ 2026 కోసం ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకున్న ముంబై ఇండియన్స్
  • కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కంటే నాట్ స్కివర్‌కే తొలి ప్రాధాన్యం
  • జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన హర్మన్‌ప్రీత్
  • యాస్తిక భాటియా, పూజా వస్త్రాకర్ వంటి కీలక ప్లేయర్లకు ఉద్వాసన
  • రూ. 5.75 కోట్ల పర్స్‌తో మెగా వేలంలోకి అడుగుపెట్టనున్న ముంబై
  • ఈ నెల‌ 27న న్యూఢిల్లీలో జరగనున్న డ‌బ్ల్యూపీఎల్ మెగా వేలం
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీ సంచలన నిర్ణయాలు తీసుకుంది. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు, తమ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కంటే ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్-బ్రంట్‌కు రిటెన్షన్ జాబితాలో తొలి ప్రాధాన్యం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేగాక‌ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (రూ. 2.5 కోట్లు) కంటే నాట్ స్కివర్‌ను (రూ. 3.5 కోట్లు) అధిక ధరకు అట్టిపెట్టుకుంది.

హర్మన్‌ప్రీత్ కౌర్ పెద్ద మనసు
అయితే, ఈ నిర్ణయం వెనుక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పెద్ద మనసు ఉన్నట్లు తెలుస్తోంది. 2026 సీజన్ కోసం బలమైన జట్టును నిర్మించడంపై దృష్టి సారించాలని భావించిన హర్మన్‌ప్రీత్, నాట్ స్కివర్‌ను తొలి రిటెన్షన్ ప్లేయర్‌గా ఎంచుకోవాలని యాజమాన్యానికి సూచించినట్లు స‌మాచారం. జట్టు ప్రయోజనాల దృష్ట్యా తాను రెండో ప్రాధాన్యంగా ఉండేందుకు అంగీకరించారని తెలుస్తోంది. 2025 డ‌బ్ల్యూపీఎల్ సీజన్‌లో నాట్ స్కివర్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంగతి తెలిసిందే.

ముంబై ఇండియన్స్ మొత్తం ఐదుగురు క్రీడాకారిణులను రిటైన్ చేసుకుంది. నాట్ స్కివర్, హర్మన్‌ప్రీత్ కౌర్‌లతో పాటు వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ (రూ. 1.75 కోట్లు), భారత ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్ (రూ. 1 కోటి), అండర్-19 ప్రపంచకప్ విజేత, వికెట్ కీపర్ బ్యాటర్ జి. కామలిని (రూ. 50 లక్షలు) ఈ జాబితాలో ఉన్నారు.

ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ సహ యజమాని ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ... "రిటెన్షన్ ప్రక్రియ ఎప్పుడూ సవాలుతో కూడుకున్నదే. అత్యుత్తమ ప్రతిభ ఉన్నవారి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కెప్టెన్సీతో స్ఫూర్తినిచ్చే హర్మన్‌ప్రీత్, అంతర్జాతీయ మ్యాచ్ విన్నర్లు, యువ ప్రతిభావంతుల కలయికతో మా రిటెన్షన్ జాబితా సమతూకంగా ఉంది" అని వివరించారు.

ఈ రిటెన్షన్‌తో ముంబై ఇండియన్స్ రూ. 5.75 కోట్ల పర్స్‌తో వేలంలోకి వెళ్లనుంది. ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోవడం వల్ల వారికి రైట్ టు మ్యాచ్ (RTM) కార్డును ఉపయోగించుకునే అవకాశం ఉండదు. డ‌బ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం ఈ నెల‌ 27న న్యూఢిల్లీలో జరగనుండగా, ప్రతి ఫ్రాంచైజీకి జట్టు నిర్మాణం కోసం రూ. 15 కోట్లు కేటాయించారు.

ఎంఐ విడుదల చేసిన కీలక ప్లేయర్లు:
యాస్తిక భాటియా, పూజా వస్త్రాకర్, షబ్నిమ్ ఇస్మాయిల్, అమెలియా కెర్, సజీవన్ సజన వంటి పలువురు స్టార్ ప్లేయర్లను వేలం కోసం విడుదల చేసింది.
WPL 2026
Harmanpreet Kaur
Mumbai Indians
Nat Sciver-Brunt
Womens Premier League
MI Retention
Hayley Matthews
Amanjot Kaur
G Kamalini
Akash Ambani

More Telugu News