Gurubelli Venkata Narsimha Rao: బియ్యాన్ని తరలించడానికి రూ. 75,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన అధికారి

Gurubelli Venkata Narsimha Rao Caught Taking Bribe in Asifabad
  • ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
  • పౌరసరఫరాల కార్యాలయ మేనేజర్, పీఏ అరెస్టు
  • గోదాము నుంచి పౌర సరఫరాల గోదాముకు తరలింపుకు అనుమతిచ్చేందుకు లంచం డిమాండ్
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని గోదాము నుండి ఆసిఫాబాద్‌లోని పౌర సరఫరాల గోదాముకు తరలించడానికి అనుమతి ఇవ్వడానికి రూ. 75,000 లంచం తీసుకుంటున్న పౌర సరఫరాల అధికారిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు.

ఆసిఫాబాద్ జిల్లా పౌర సరఫరాల కార్యాలయ మేనేజర్ గురుబెల్లి వెంకటనర్సింహారావు, పీఏ (పొరుగు సేవల ఉద్యోగి) కొత్తగొల్ల మణికాంత్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

పీడీఎస్ బియ్యాన్ని తన గోదాము నుండి ఆసిఫాబాద్‌లోని పౌర సరఫరాల గోదాముకు తరలించేందుకు అధికారులు తన నుండి రూ. 75,000 లంచం డిమాండ్ చేస్తున్నారని బాధితుడు ఒకరు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు వ్యూహం పన్ని వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగినట్లయితే అవినీతి నిరోధక శాఖకు తెలియజేయాలని ఏసీబీ ప్రజలకు సూచించింది. అవినీతి నిరోధక శాఖ కార్యాలయం టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చునని తెలిపింది. అంతేకాకుండా సామాజిక మాధ్యమాలైన వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్‌సైట్ (http://acb.telangana.gov.in) ద్వారా కూడా ఏసీబీ అధికారులకు సమాచారం అందించవచ్చునని తెలిపింది. ఫిర్యాదుదారులు లేదా బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది.
Gurubelli Venkata Narsimha Rao
ACB
Anti Corruption Bureau
Telangana ACB
Asifabad
Bribery Case

More Telugu News