Rahul Gandhi: గతంలో మద్యం లేదా డ్రగ్స్‌తో జరిగే పని.. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌తో జరుగుతోంది: రాహుల్ గాంధీ

Rahul Gandhi Slams Modi Over Social Media Addiction
  • మోదీ యువతకు ఉద్యోగాల బదులు డేటా మత్తు ఇస్తునారన్న రాహుల్ గాంధీ 
  • సోషల్ మీడియాను '21వ శతాబ్దపు మత్తు'గా అభివర్ణన
  • భారత యువత ఉద్యోగాలను చైనాకు తరలించారని ఆరోపణ
  • నితీశ్ కుమార్ రిమోట్ కంట్రోల్ ప్రధాని చేతిలో ఉందన్న రాహుల్
  • ఓట్ల దొంగతనాన్ని ప్రతిఘటించాలని యువతకు పిలుపు
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ యువతకు ఉద్యోగాలు కల్పించకుండా, వారికి చౌకగా డేటా అందించి సోషల్ మీడియాకు బానిసలను చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీన్ని '21వ శతాబ్దపు మత్తు'గా ఆయన అభివర్ణించారు. గురువారం బీహార్‌లోని పూర్నియాలో జరిగిన భారీ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "మీ ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి మీకు 21వ శతాబ్దపు మత్తును ఇచ్చారని చెప్పారు. గతంలో మద్యం లేదా డ్రగ్స్‌తో జరిగే పని, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌తో జరుగుతోంది. యువత 24 గంటలూ రీల్స్ చూస్తూనే ఉన్నారు" అని అన్నారు. సభకు హాజరైన వారిని ఉద్దేశించి, "ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌తో మీ జేబుల్లోకి ఎంత డబ్బు వచ్చింది? మీకు ఉద్యోగాలు కావాలా? లేక ఇన్‌స్టాగ్రామ్ కావాలా?" అని సూటిగా ప్రశ్నించారు.

ప్రధాని మోదీ భారత యువత ఉపాధిని లాక్కొని, దాన్ని చైనా యువతకు అప్పగించారని రాహుల్ ఆరోపించారు. "ఆయన మీ ఉపాధిని తీసివేసి చైనాకు ఇచ్చానని మీకు చెప్పరు. బీహార్ యువతను కార్మికులుగా మార్చేశారు" అని విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని, అదే సమయంలో కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తలు మాత్రమే లబ్ధి పొందుతున్నారని ధ్వజమెత్తారు.

బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై కూడా రాహుల్ విమర్శలు గుప్పించారు. ఆయన "రిమోట్ కంట్రోల్" ప్రధాని మోదీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. "ఓట్ల దొంగతనాన్ని ప్రతిఘటించాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని" యువ ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పన, విశ్వవిద్యాలయాల నిర్మాణం, ప్రపంచ స్థాయి నలందా విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించి బీహార్ విద్యా వైభవాన్ని తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. "మేము మీ జేబుల్లో డబ్బు పెట్టాలనుకుంటున్నాం, బిలియనీర్ల జేబుల్లో కాదు" అని రాహుల్ స్పష్టం చేశారు. తమ మహాఘట్‌బంధన్ ప్రభుత్వం పేదలు, బడుగు బలహీన వర్గాలు, కార్మికుల కోసం పనిచేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
Rahul Gandhi
Narendra Modi
Bihar
Instagram
Facebook
Youth
Employment
Social Media
Elections
India Alliance

More Telugu News