Chandrababu: వరుస ప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆవేదన.. వ్యవస్థాగత లోపాలపై కీల‌క‌ వ్యాఖ్యలు

Chandrababu Reacts to Accidents Cites Systemic Failures
  • కొన్ని రాష్ట్రాల నామమాత్రపు రిజిస్ట్రేషన్లతోనే అసలు సమస్య అన్న సీఎం
  • టెక్నాలజీ వాడితే ప్రమాదాలు అరికట్టవచ్చన్న చంద్ర‌బాబు
  • కాశీబుగ్గ ఘటన క్రౌడ్ మేనేజ్‌మెంట్ వైఫల్యమేనని స్పష్టీకరణ
  • ప్రమాదాల నివారణకు పటిష్ఠ‌ రెగ్యులేటరీ అథారిటీ అవసరమ‌న్న ముఖ్య‌మంత్రి
  • ప్రజల భద్రత కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన వరుస ఘోర ప్రమాదాలపై ఏపీ చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాలు, కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనలు అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. కేవలం విచారం వ్యక్తం చేయడమే కాకుండా ఈ ప్రమాదాల వెనుక ఉన్న వ్యవస్థాగత లోపాలు, పాలసీపరమైన సమస్యలను ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా టెక్నాలజీని వాడుకోవాలని, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పాలసీ లోపాల వల్లే ఘోరాలు
కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో ఉన్న సంక్లిష్టతలను ముఖ్యమంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ పర్మిట్లు ఇస్తున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాలు నామమాత్రపు ఫీజులతో వాహన రిజిస్ట్రేషన్లు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. "కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సు ఒడిశాలో రిజిస్టర్ అయింది. తెలంగాణ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ప్రమాదం జరిగింది ఏపీలో, బస్సు వెళ్లేది కర్ణాటకకు. కానీ చనిపోయింది తెలుగువారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదాన్ని ఎలా చూడాలి?" అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ తరహా పాలసీ లోపాలపై చర్చించి సరిదిద్దకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

కాశీబుగ్గ ఘ‌ట‌న‌కు అధికారుల వైఫల్యమే కార‌ణం
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ, ఇది స్పష్టంగా క్రౌడ్ మేనేజ్‌మెంట్ వైఫల్యమేనని అన్నారు. ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేయడంలో స్థానిక అధికారులు విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు. "అక్కడి సీఐ, ఎస్సైకి తెలియకుండా ఇంత పెద్ద ఘటన ఎలా జరిగింది? క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో లోపం ఎక్కడ జరిగింది?" అని ఆయన నిలదీశారు. తెలంగాణలోని చేవెళ్ల బస్సు ప్రమాదంలోనూ భారీ ప్రాణనష్టం జరగడంపై విచారం వ్యక్తం చేశారు.

పటిష్ఠ‌మైన వ్యవస్థ అవసరం
ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం స్పందించడమే కాకుండా, అవి మళ్లీ జరగకుండా చూడటమే ప్రభుత్వాల బాధ్యత అని చంద్రబాబు అన్నారు. ఇందుకోసం పటిష్టమైన రెగ్యులేటరీ అథారిటీ, స్పష్టమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ఉండాలని నొక్కిచెప్పారు. ప్రమాదాల్లో ఎక్కువగా నిరుపేదలే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Chandrababu
Andhra Pradesh
Road Accidents
Kurnool Bus Accident
Kashibugga Temple
Crowd Management
Policy Failures
Telangana
Chevella Bus Accident
AP Government

More Telugu News