ER Eswaran: రాత్రిపూట ఆ యువతి బయటకు వెళ్లింది: అత్యాచార బాధితురాలిపై ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ER Eswarans controversial remarks on rape victim spark outrage
  • తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
  • అర్ధరాత్రి ఒక పురుషుడితో బయటకు వెళ్లడాన్ని సామాజిక పతనంగా అభివర్ణించిన ఈశ్వరన్
  • ఎమ్మెల్యే వ్యాఖ్యలు అతని దిగజారుడుతనానికి నిదర్శనమన్న అన్నామలై
తమిళనాడు రాష్ట్రం, కోయంబత్తూరులో కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం తీవ్ర కలకలం రేపింది. ఈ దుర్ఘటనపై ఎమ్మెల్యే ఈఆర్ ఈశ్వరన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాత్రిపూట ఆమె బయటకు ఎందుకు వెళ్లిందని ఆయన ప్రశ్నించడం విమర్శలకు దారితీసింది.

అర్ధరాత్రి ఒక పురుషుడితో బయటకు వెళ్లడాన్ని సామాజిక పతనంగా ఈశ్వరన్ అభివర్ణించారు. ఈశ్వరన్ డీఎంకే మిత్రపక్ష ఎమ్మెల్యే. ఆయన కొంగునాడు మక్కల్ దేశియా కట్చి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలను ఖండించింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలు అతని దిగజారుడుతనానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడిన దృశ్యాలను అన్నామలై సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అధికార పార్టీ డీఎంకే తన మిత్రపక్షాలను ఉపయోగించుకుని బాధితురాలిపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.

కోయంబత్తూరులోని విమానాశ్రయం సమీపంలో ఆదివారం రాత్రి బాధితురాలు తన స్నేహితుడితో కలిసి కారులో కూర్చుని మాట్లాడుతోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు విద్యార్థిని, ఆమె స్నేహితుడితో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ముగ్గురు తమ వద్ద ఉన్న కొడవలితో స్నేహితుడిపై దాడి చేశారు. అతను స్పృహ కోల్పోగానే వారు విద్యార్థినిని బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. వారికోసం ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ER Eswaran
Coimbatore rape case
Tamil Nadu
rape victim
K Annamalai
DMK
Kongunadu Makkal Desia Katchi

More Telugu News