ఈ యాక్షన్ థ్రిల్లర్ ను మిస్సయితే ఫీలవడం ఖాయం!

  • జోజు జార్జ్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్
  • ఈ ఏడాది జనవరి నుంచి 'సోనీ లివ్'కి   
  • తెలుగులోను అందుబాటులో
  • యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చే కంటెంట్

మలయాళంలో 'పని' అనే ఒక సినిమా కొంతకాలంగా 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. జోజు జార్జ్ కథానాయకుడిగా నటించడమే కాకుండా, ఆయనే దర్శకత్వం వహించిన సినిమా ఇది. క్రితం ఏడాది ఆక్టోబర్ 24వ తేదీన థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, చాలా తక్కువ సమయంలోనే 40 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. ఆ తరువాత మలయాళంతో పాటు ఇతర భాషల్లోను ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. 

జోజు జార్జ్ ఈ సినిమాలో 'గిరి' అనే గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడు. ఆయన క్రింద పనిచేసే అనుచరులు .. ఆయన మాట వినే పోలీస్ అధికారులు .. ఆయన అంటే భయపడే శత్రువులు చాలామంది ఉంటారు. ఆయన మాట పైనే సెటిల్ మెంట్లు జరిగిపోతూ ఉంటాయి. అలాంటి 'గిరి' భార్యపై డాన్ - సిజూ అనే ఇద్దరు మెకానిక్ కుర్రాళ్లు అత్యాచారం జరుపుతారు. దాంతో ఆ ఇద్దరిపై పగ తీర్చుకోవడం కోసం అతనే రంగంలోకి దిగుతాడు. ఆయన వేట ఎలా కొనసాగుతుంది? అనేదే కథ. 

సాధారణంగా ఒక వ్యక్తి బలం గురించి తెలియనప్పుడే ఆ వ్యక్తి ఫ్యామిలీతో పెట్టుకోవడం జరుగుతుంటుంది. తెలిసిన తరువాత భయపడటం .. బెదిరిపోవడం .. పారిపోవడం చేస్తారు. కానీ తాము గొడవపడింది ఒక గ్యాంగ్ స్టర్ తో అని తెలిసి కూడా ఆ కుర్రాళ్లు ఇద్దరూ తమ పోరాటాన్ని కొనసాగించడమే ఈ కథలో ఆసక్తిని రేకెత్తించే అంశం. అక్కడక్కడా హింస .. అశ్లీల సన్నివేశాలు ఉన్నాయి. అందువలన ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం బెటర్. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. 



More Telugu News