Hyderabad Metro Rail: పాతబస్తీ మెట్రో రైలు నిర్మాణం... ఆ వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

Hyderabad Metro Rail Construction Details Sought by High Court
  • పాతబస్తీ మెట్రో నిర్మాణం విషయంలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
  • మెట్రో నిర్మాణంపై హైకోర్టులో విచారణ
  • పాతబస్తీలో అభివృద్ధిని అడ్డుకోవడానికే పిటిషన్ దాఖలు చేశారన్న ప్రభుత్వం
  • నిర్మాణ పనులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని ఆదేశం
పాతబస్తీ అభివృద్ధికి మెట్రో రైలు నిర్మాణం ఎంతో కీలకమని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. అయితే, నిర్మాణ పనులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాతబస్తీ మెట్రో నిర్మాణం విషయంలో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. మెట్రో నిర్మాణాల వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని, పురావస్తు శాఖ అనుమతులు తీసుకోలేదని పిటిషన్ దాఖలైంది.

చారిత్రక కట్టడాలకు సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. పాతబస్తీ అభివృద్ధికి మెట్రో రైలు చాలా కీలకమని కోర్టుకు తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు రెండో దశ మెట్రో నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. పాతబస్తీలో అభివృద్ధిని అడ్డుకోవడానికే ఈ పిటిషన్ దాఖలు చేశారని ఆయన అన్నారు.

ఇరువైపుల వాదనలను విన్న న్యాయస్థానం నిర్మాణ పనులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని ప్రభుత్వానికి సూచించింది. నిర్దేశిత చారిత్రక కట్టడాల వద్ద మెట్రో నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను సమర్పించాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.
Hyderabad Metro Rail
Old City Metro
Telangana High Court
Metro construction
Public Interest Litigation

More Telugu News