Nithin Kunnath Raj: దుబాయ్‌లో భారతీయుడికి జాక్‌పాట్.. లాటరీలో పావు కిలో బంగారం!

Nithin Kunnath Raj wins quarter kilo gold in Dubai lottery
  • దుబాయ్‌లో ప్రవాస భారతీయుడికి జాక్‌పాట్
  • బిగ్ టికెట్ డ్రాలో పావు కిలో బంగారం గెలుచుకున్న వైనం
  • కేరళకు చెందిన నితిన్ కున్నత్‌కు దక్కిన అదృష్టం
  • 10 మంది స్నేహితులతో కలిసి టికెట్ కొనుగోలు
  • గెలుచుకున్న బంగారం విలువ సుమారు రూ. 30 లక్షలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్న ఓ ప్రవాస భారతీయుడిని అదృష్టం వరించింది. దుబాయ్‌లో నిర్వహించిన ప్రఖ్యాత 'బిగ్ టికెట్' ఈ-డ్రాలో ఏకంగా పావు కిలో బంగారం గెలుచుకున్నారు. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

కేరళకు చెందిన నితిన్ కున్నత్ రాజ్, ఉపాధి నిమిత్తం 2016 నుంచి దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఇటీవల ఆయన తన స్నేహితులతో కలిసి కొనుగోలు చేసిన టికెట్‌కు ఈ జాక్‌పాట్ తగిలింది. డ్రా నిర్వాహకులు నితిన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పగా, ఆయన తొలుత నమ్మలేదు. ఎవరో సరదాకి చేస్తున్నారని భావించారు. అయితే, వారు టికెట్ నంబర్ 351853 సహా పూర్తి వివరాలు చెప్పడంతో ఆశ్చర్యపోయారు.

ఈ డ్రాలో ఆయన 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 250 గ్రాముల బంగారు కడ్డీని గెలుచుకున్నారు. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 30 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ టికెట్‌ను తాను మరో 10 మంది స్నేహితులతో కలిసి వేర్వేరు పేర్లతో కొనుగోలు చేశానని నితిన్ తెలిపారు. గెలుచుకున్న ఈ బహుమతిని వారందరితో పంచుకుంటానని స్పష్టం చేశారు. తన జీవితంలో ఇలాంటి అదృష్టం వరించడం ఇదే మొదటిసారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

కాగా, ఇటీవల ఇదే బిగ్ టికెట్ 'సిరీస్ 280' డ్రాలో మరో ప్రవాస భారతీయుడైన శరవణన్ వెంకటాచలం 25 మిలియన్ల దిర్హామ్‌లు (సుమారు రూ. 60.42 కోట్లు) గెలుచుకున్న విషయం తెలిసిందే. తరచూ భారతీయులు ఈ డ్రాలో విజేతలుగా నిలుస్తుండటం గమనార్హం.
Nithin Kunnath Raj
Dubai Big Ticket
UAE
Indian expat
Gold prize
Lottery
Kerala
Sharavanan Venkatachalam
Big Ticket Series 280
Dubai lottery

More Telugu News