Zohran Mamdani: అమెరికాలోనూ ఫ్రీబస్ పథకం.. న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ విజయానికి అదే కారణం!

Zohran Mamdani Free Bus Scheme in New York Inspired by Kejriwal
  • న్యూయార్క్ నగర మేయర్‌గా జొహ్రాన్ మమ్దానీ విజయం
  • 'ఉచితాల' మోడల్‌తో ఎన్నికల ప్రచారం
  • నగరంలో బస్సు ప్రయాణాన్ని ఉచితం చేస్తానని హామీ
  • సంపన్నులపై పన్నుతో నిధులు సమీకరించే ప్రణాళిక
  • చైల్డ్ కేర్, ఇంటి అద్దెలపైనా కీలక హామీలు
  • భారత రాజకీయ వ్యూహాలు అమెరికాలోనూ సక్సెస్
న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ సోషలిస్ట్ అభ్యర్థి జొహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ నగరానికి తొలి ముస్లిం, వలసదారు మేయర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. అయితే, ఈ గెలుపు వెనుక  'ఉచితాల' మోడల్ ఉండటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మమ్దానీ ఇచ్చిన ప్రధాన హామీ న్యూయార్క్ నగరంలో బస్సు ప్రయాణాన్ని పూర్తిగా ఉచితం చేయడం. ఈ పథకం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రవేశపెట్టిన 'పింక్ టికెట్' పథకాన్ని పోలి ఉంది.  2019లో కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ పథకం ఆప్ ప్రభుత్వానికి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అదే తరహా వ్యూహాన్ని మమ్దానీ న్యూయార్క్‌లో అమలు చేయబోతున్నారు. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో కూటమి మహిళలకు ఉచిత బస్సు హామీ ఇచ్చి విజయం సాధించాయి.

నిధులు ఎక్కడి నుంచి?
న్యూయార్క్‌లో బస్సులను ఉచితం చేయడానికి ఏటా 1.2 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా. ఈ పథకం వల్ల ప్రయాణికుల సంఖ్య 20 నుంచి 30 శాతం పెరుగుతుందని 'రైడర్స్ అలయన్స్' అనే సంస్థ పేర్కొంది. ఈ నిధుల కోసం మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం ఉన్నవారిపై 2 శాతం పన్ను విధించాలని, కార్పొరేట్ సబ్సిడీలను తగ్గించాలని మమ్దానీ ప్రతిపాదించారు. ఢిల్లీలో రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించగా, మమ్దానీ సంపన్నులపై పన్ను ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.

కేవలం బస్సు ప్రయాణమే కాకుండా, కేజ్రీవాల్ తరహాలోనే మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా మమ్దానీ ప్రకటించారు. తక్కువ ఆదాయ వర్గాల కోసం యూనివర్సల్ చైల్డ్ కేర్,  ఇళ్ల అద్దెల పెరుగుదల 3 శాతానికి మించకుండా నియంత్రించడం, తక్కువ ధరలకే నిత్యావసరాలు అందించే 'పీపుల్స్ మార్కెట్స్' ఏర్పాటు వంటి హామీలు ఆయన మేనిఫెస్టోలో ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌లో, భారత్‌లోని పేద రాష్ట్రాల్లో విజయవంతమైన ఉచిత హామీలకు ఆదరణ లభించడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.
Zohran Mamdani
New York Mayor
Free bus scheme
Arvind Kejriwal
Aam Aadmi Party
Delhi Pink Ticket
Free public transport
New York elections
Welfare schemes
US Politics

More Telugu News