RK Beach: ఆర్కే బీచ్‌లో వెలుగులోకి బ్రిటీష్ కాలంనాటి బంకర్.. పర్యాటకుల సందడి

RK Beach Visakhapatnam Reveals British Era Bunker After Sea Retreat
  • విశాఖ ఆర్కే బీచ్‌లో వెనక్కి వెళ్లిన సముద్రం
  • బయటపడిన పురాతన బంకర్, భారీ శిలలు
  • రాళ్లపైకి ఎక్కి సెల్ఫీలతో సందడి చేసిన పర్యాటకులు
విశాఖలోని ఆర్కే బీచ్ లో ఓ ఆసక్తికర దృశ్యం సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పుడూ అలలతో ఉప్పొంగే సముద్రం ఒక్కసారిగా భారీగా వెనక్కి తగ్గింది. దీంతో సముద్ర గర్భంలో సాధారణంగా కనిపించని భారీ శిలలు, రాళ్లు స్పష్టంగా తేలాయి. అంతేకాకుండా, బ్రిటిష్ కాలం నాటిదిగా భావిస్తున్న ఓ పురాతన బంకర్ కూడా బయటపడింది.

ఈ ఊహించని పరిణామంతో పర్యాటకులు, స్థానికులు ఆసక్తిగా తీరానికి చేరుకున్నారు. సముద్రం వెనక్కి వెళ్లడంతో బయటపడిన రాళ్లపైకి ఎక్కి సందడి చేశారు. ముఖ్యంగా యువత సెల్ఫీలు, వీడియో రీల్స్ తీసుకుంటూ ఉత్సాహంగా కనిపించారు. ఇటీవల వరుస తుఫాన్లు, అల్పపీడనాలతో అల్లకల్లోలంగా కనిపించిన విశాఖ తీరం, కార్తీక పౌర్ణమి నాడు ప్రశాంతంగా మారడంతో పాటు ఇలా వెనక్కి వెళ్లడం చర్చనీయాంశమైంది.

అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆటుపోట్లలో వచ్చే మార్పులు, వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రం ముందుకు రావడం లేదా వెనక్కి వెళ్లడం సాధారణ ప్రక్రియేనని వారు వివరిస్తున్నారు.

ఇదే సమయంలో, ఆర్కే బీచ్ రోడ్‌లో కొత్తగా ప్రారంభమైన 'మాయా వరల్డ్' అనే అద్దాల నిర్మాణం కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ కొత్త ఆకర్షణకు తోడు, సముద్రం వెనక్కి వెళ్లిన దృశ్యం కూడా తోడవడంతో బీచ్ వద్ద సందర్శకుల సందడి నెలకొంది. 
RK Beach
Visakhapatnam
British Bunker
Andhra Pradesh
Sea Retreat
Karthika Pournami
Maya World
Tourism
Bay of Bengal

More Telugu News