Telangana Government: తెలంగాణ సర్కారు బడుల్లో కంప్యూటర్ టీచర్లు.. నెలకు రూ.15,000 వేతనం

Telangana Government Appoints Computer Teachers in Schools
  • తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం
  • రెండు దశాబ్దాల తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
  • రాష్ట్రవ్యాప్తంగా 2,837 పాఠశాలల్లో బోధకుల భర్తీ
  • ఔట్ సోర్సింగ్ విధానంలో టీజీటీఎస్ ద్వారా నియామక ప్రక్రియ
  • నెలకు రూ. 15,000 గౌరవ వేతనం.. పది నెలల పాటు చెల్లింపు
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత కంప్యూటర్ టీచర్ల (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల) నియామకానికి పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది.

రాష్ట్రవ్యాప్తంగా 5 లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఉన్న 2,837 పాఠశాలలను అధికారులు గుర్తించారు. ఈ స్కూళ్లలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్) ద్వారా త్వరలోనే ఈ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 చొప్పున పది నెలల పాటు గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ వ్యయాన్ని సమగ్ర శిక్షా నిధుల నుంచి భరించనున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో సుమారు 20 ఏళ్ల క్రితం 4,200 పాఠశాలల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి, ఐదేళ్ల కాలపరిమితితో ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. అయితే, ఆ తర్వాత వారిని తొలగించడంతో కంప్యూటర్ ల్యాబ్‌లు నిరుపయోగంగా మారాయి. సరైన పర్యవేక్షణ కొరవడి చాలా కంప్యూటర్లు మూలకు చేరాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా నియమించే బోధకులు ల్యాబ్‌ల నిర్వహణతో పాటు విద్యార్థులకు డిజిటల్ విద్య‌ను అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే అమలవుతున్న పలు డిజిటల్ కార్యక్రమాల విజయవంతానికి కూడా ఈ నియామకాలు దోహదపడనున్నాయి. ఏక్‌స్టెప్ ఫౌండేషన్ సహకారంతో 1,354 పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘అసిస్టెడ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ మ్యాథ్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌’, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించిన ‘ఖాన్ అకాడమీ’ ఆన్‌లైన్ తరగతుల వంటివి సమర్థవంతంగా నడవాలంటే కంప్యూటర్లపై అవగాహన ఉన్న బోధకుల అవసరం ఎంతో ఉంది. ఈ కొత్త నియామకాలతో ప్రభుత్వ పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లు తిరిగి తెరుచుకొని, డిజిటల్ విద్యాబోధనకు కొత్త ఊపు వస్తుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
Telangana Government
Telangana schools
Computer teachers
ICT instructors
Digital education
Outsourcing
Technology Services
Khan Academy
EkStep Foundation
Government schools

More Telugu News